అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో జరిగిన ఉన్మాది దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఇతర విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై లోకేశ్ మాట్లాడుతూ.. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. "వైద్యులు రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స కొనసాగుతోంది. అనంతరం గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చికిత్స అందిస్తారు. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని లోకేశ్ పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్న వైద్య బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన తోటి విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం 20 మంది కౌన్సెలర్లతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం, ఘటన జరిగిన పదో తరగతి 'ఏ' సెక్షన్‌లోని 32 మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారితో, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతోంది. అదేవిధంగా 8, 9, 10 తరగతులకు చెందిన ఇతర విద్యార్థినులకు కూడా కౌన్సెలింగ్ అందించనున్నారు.

ఈ చర్యల ద్వారా విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, తిరిగి ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు హాజరయ్యేలా చూడటమే లక్ష్యమని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా చదువుపై దృష్టి సారించేలా అవసరమైన సహాయాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.