చాట్‌జీపీటీకి మీ రహస్యాలు చెబుతున్నారా?.. సామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక హెచ్చరిక

Sam Altman warns against sharing secrets with ChatGPT
  • చాట్‌జీపీటీ చాట్స్‌పై ఆల్ట్‌మన్‌ హెచ్చరిక
  • ఏఐ చాట్‌లకు చట్టపరమైన గోప్యత లేదని వెల్లడి
  • అవసరమైతే చాట్‌ హిస్టరీని అధికారులకు ఇవ్వొచ్చని స్పష్టీకరణ
  • ఓపెన్‌ఏఐ ఉద్యోగులు చాట్‌లు చదవరని వెల్లడి
  • కొన్ని చాట్‌లు శిక్షణ కోసం నిల్వ చేస్తామని వివరణ 
మనసులోని బాధలు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఆందోళనలు.. ఇలా జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలామంది చాట్‌జీపీటీతో పంచుకుంటున్నారు. అయితే అలాంటి సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని భావించొద్దని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌ హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో చాట్‌ రికార్డులు చట్టపరమైన విచారణల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సామ్‌ ఆల్ట్‌మన్‌ మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత చాట్‌జీపీటీని థెరపిస్ట్‌, లైఫ్‌ కోచ్‌లా ఉపయోగిస్తోందన్నారు. బంధాల్లో సమస్యలు, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత నిర్ణయాలపై ఏఐ సలహా తీసుకుంటున్నారని చెప్పారు.

అయితే వైద్యుడు, న్యాయవాది లేదా మానసిక వైద్యుడితో మాట్లాడినప్పుడు ఉండే చట్టపరమైన గోప్యత చాట్‌జీపీటీ సంభాషణలకు ప్రస్తుతం లేదని ఆల్ట్‌మన్‌ తెలిపారు. ఒకవేళ కోర్టు లేదా దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా సమాచారం కోరితే, అవసరమైన సందర్భాల్లో చాట్‌ రికార్డులను అందించాల్సి రావచ్చని చెప్పారు. 

ఇప్పటికే అమెరికాలో న్యూయార్క్‌ టైమ్స్‌ దాఖలు చేసిన కాపీరైట్‌ కేసులో ఫెడరల్‌ కోర్టు ఆదేశాల మేరకు ఓపెన్‌ఏఐ కొంత చాట్‌జీపీటీ లాగ్‌ డేటాను భద్రపరచాల్సి వచ్చింది. ఈ పరిణామం కూడా ఏఐ చాట్‌ల గోప్యతపై చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం.. నేరానికి సంబంధించిన సమాచారం, చట్టపరమైన వివాదాలకు సంబంధించిన వివరాలు లేదా దర్యాప్తులో కీలకంగా మారే అంశాలు చాట్‌జీపీటీలో ఉంటే, అవి భవిష్యత్తులో ఆధారాలుగా ఉపయోగించే అవకాశం ఉండొచ్చు.

అయితే దీనర్థం ఓపెన్‌ఏఐ ఉద్యోగులు వినియోగదారుల చాట్‌లను చదువుతారని కాదు. వినియోగదారులు ఎంచుకున్న ప్రైవసీ సెట్టింగులను బట్టి కొన్ని చాట్‌లు ఏఐ శిక్షణ, సేవల మెరుగుదల కోసం నిల్వ అయ్యే అవకాశం ఉంటుందని సంస్థ నిబంధనల్లో పేర్కొంది.

వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ వివరాలు, అధికారిక రహస్యాల వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఏ ఏఐ చాట్‌బాట్‌లోనూ పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ భద్రత నిపుణులు సూచిస్తున్నారు.
Sam Altman
ChatGPT
OpenAI
AI Privacy Warning
Data Security
Digital Privacy

More Telugu News