బ్యాటరీ ఖాళీ అయినా 13 కి.మీ.. మహీంద్రా కొత్త ఈవీలో అదిరిపోయే ఫీచర్‌!

Mahindra BE6 Sporteq Launched In India
  • బీఈ6 స్పోర్టెక్‌ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు
  • బీఏఏఎస్‌ లేకుండా ధర రూ.19.45 లక్షలు
  • రివైవ్‌ ఎస్‌ఓఎస్‌తో 13 కి.మీ వరకు అదనపు రేంజ్‌
  • 79kWh బ్యాటరీతో 682 కి.మీ వరకు రేంజ్‌
  • గరిష్ఠంగా 286hp శక్తి, 380Nm టార్క్‌
మహీంద్రా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి వచ్చింది. బీఈ6 స్పోర్టెక్‌ పేరుతో విడుదలైన ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు. ఇది బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (BaaS) పథకం ధర. బీఏఏఎస్‌ లేకుండా ప్రారంభ ధర రూ.19.45 లక్షలుగా ఉంది. కొత్త మోడల్‌లో డిజైన్‌ మార్పులతో పాటు టెక్నాలజీ, డ్యాష్‌బోర్డ్‌లోనూ కీలక మార్పులు చేశారు. లాంచ్‌ ఎడిషన్‌, ఫోర్‌, ఎఫ్‌ఈ, ఎఫ్‌ఈ ఫోర్‌ వంటి ప్రత్యేక వేరియంట్లను అందుబాటులోకి తెచ్చారు.

బీఈ6 స్పోర్టెక్‌ మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది. ‘వన్‌’ వేరియంట్‌ 59kWh బ్యాటరీతో బీఏఏఎస్‌ ధర రూ.11.45 లక్షలు కాగా.. సాధారణ ధర రూ.19.45 లక్షలు. ‘టూ’ ధరలు వరుసగా రూ.12.95 లక్షలు, రూ.20.95 లక్షలు. ‘త్రీ’ ధర రూ.21.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ‘త్రీ+’ ధర రూ.23.95 లక్షల నుంచి ఉంది. ఫోర్‌, లాంచ్‌ ఎడిషన్‌, ఎఫ్‌ఈ ఫోర్‌ ధర రూ.26.95 లక్షలు కాగా.. ఎఫ్‌ఈ వేరియంట్‌ ధర రూ.24.45 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

కొత్త బీఈ6 స్పోర్టెక్‌లో బయట డిజైన్‌ పెద్దగా మారలేదు. లాంచ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక పెయింట్‌ స్కీమ్‌ ఇచ్చారు. వెనుక భాగంలో లాంచ్‌ ఎడిషన్‌ బ్యాడ్జ్‌, బీఈ6 లెటరింగ్‌ ఉన్నాయి. వెనుక లైట్ల సాయంతో టెయిల్‌గేట్‌పై సందేశాలను ప్రదర్శించే సదుపాయం కూడా ఉంది. మొత్తం 12 రంగుల్లో ఈ ఎస్‌యూవీ లభిస్తుంది. వీటిలో రోసో ఇంపల్సో, రూబీ వెల్వెట్‌, గ్రాఫైట్‌ స్టోర్మ్‌, ఫైర్‌స్టార్మ్‌ ఆరెంజ్‌ సాటిన్‌  అనే నాలుగు కొత్త రంగులు ఉన్నాయి. ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక ఆరెంజ్‌ రంగును అందించారు.

ఇంటీరియర్‌లో మాత్రం కీలక మార్పులు చేశారు. లాంచ్‌ ఎడిషన్‌లో మూడు స్క్రీన్ల సెటప్‌ ఉంది. ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక స్క్రీన్‌ కూడా ఇచ్చారు. గేమింగ్‌, కరాకే కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. సెంటర్‌ కన్సోల్‌పై ప్రత్యేక స్పోర్టెక్‌ ప్లాక్‌ ఉంటుంది. TEQ_Me ద్వారా డ్రైవర్‌ను గుర్తించి వ్యక్తిగత ప్రొఫైల్‌ను లోడ్‌ చేస్తుంది. గూగుల్‌ జెమినీ ఆధారిత TEQ_Talk, వెనుక భాగంలో సందేశాలు చూపించే TEQ_xting వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవింగ్‌ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు TEQ_Driveలో ట్రైబ్‌ డ్రైవ్‌, డ్రిఫ్ట్‌ మోడ్‌, యాక్సిలరేషన్ బూస్ట్‌ వంటి ఆప్షన్లు ఇచ్చారు. రివైవ్‌ ఎస్‌ఓఎస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినా సమీప ఛార్జింగ్‌ కేంద్రానికి చేరుకునేందుకు 13 కిలోమీటర్ల వరకు అదనపు ప్రయాణ సామర్థ్యాన్ని ఇస్తుంది. బ్యాటరీ జీవితకాలంలో దీన్ని ఐదుసార్లు ఉపయోగించుకోవచ్చని మహీంద్రా తెలిపింది. ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఛార్జర్‌, క్రూజ్‌ కంట్రోల్‌, ఏడీఏఎస్‌ వంటి ఫీచర్లు కొనసాగాయి.

పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రియర్‌ మౌంటెడ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ గరిష్ఠంగా 286hp శక్తి, 380Nm టార్క్‌ అందిస్తుంది. 79kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జింగ్‌పై 682 కిలోమీటర్ల వరకు MIDC రేంజ్‌ వస్తుందని కంపెనీ చెబుతోంది.
Advertisement
Mahindra
BE6 Sporteq
Mahindra BE6 Sporteq
Electric Vehicles

More Telugu News