ప్రధాని మోదీ.. ఆ చిన్నారి టోపీ.. ఎర్రకోటలో వైరల్‌ మూమెంట్‌!

Narendra Modi viral moment with child cap at Red Fort
  • ప్రోటోకాల్‌ పక్కనపెట్టి పిల్లల వద్దకు మోదీ
  • చిన్నారి కిందపడేసిన టోపీని స్వయంగా తీసిన మోదీ
  • టోపీని చిన్నారి తలపై తిరిగి పెట్టిన వైనం
  • విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లను కలిసిన ప్రధాని
  • చిన్నారులతో మోదీ ఆప్యాయత వైరల్‌
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి, ప్రసంగం ముగించిన తర్వాత చిన్నారులను కలిసేందుకు ఆయన ముందుకు వెళ్లారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్‌’ వాలంటీర్లతో మోదీ ముచ్చటించారు. ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ చిన్న ఘటన అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఆ దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

ప్రధానిని చూసిన ఓ చిన్నారి గౌరవంతో ఆయన పాదాలకు నమస్కరించేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆమె తలపై ఉన్న టోపీ జారి కిందపడిపోయింది. వెంటనే మోదీ స్వయంగా వంగి ఆ టోపీని తీసుకున్నారు. చిన్నారి తలపై దాన్ని సరిగా పెట్టారు. ప్రధాని చూపించిన ఈ ఆప్యాయతకు చుట్టూ ఉన్న పిల్లలు చిరునవ్వులు చిందించారు. అక్కడున్నవారు చప్పట్లతో స్పందించారు. చిన్నారి కూడా ఆనందంతో మురిసిపోయింది.

ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మోదీ చిన్నారుల వద్దకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. ఈసారి కూడా తన కాన్వాయ్‌ను ఆపించి విద్యార్థులు కూర్చున్న ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లారు. పిల్లలతో కరచాలనం చేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. దేశ ప్రధానిని ఇంత దగ్గరగా చూసిన విద్యార్థులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

వేడుకల్లో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పసుపు, ముదురు నీలం రంగు దుస్తుల్లో ఉన్న చిన్నారులు ఒకచోట చేరి నిలబడ్డారు. స్వాతంత్య్ర భారత ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రధాని తమ వద్దకు వచ్చి పలకరించడంతో తమకు ఎదురైన అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిదని పలువురు విద్యార్థులు మీడియాతో ఆనందం పంచుకున్నారు.
Advertisement
Narendra Modi
Red Fort
Independence Day
School Children
Viral Video
My Bharat Volunteers

More Telugu News