గాలేలో చారిత్రక టెస్టు.. లంకపై టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

Shubman Gill wins toss against Sri Lanka in historic Galle Test
  • ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • భారత జట్టుకు ఇది చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్
  • ఆసియాలో 50 టెస్టులకు ఆతిథ్యమిచ్చిన తొలి వేదికగా గాలే రికార్డు
  • డ‌బ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇది ఇరు జట్లకు కీలక సిరీస్
భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా నేడు తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ పలు చారిత్రక మైలురాళ్లకు వేదికగా నిలవడం విశేషం. భారత క్రికెట్ జట్టుకు ఇది 600వ టెస్ట్ మ్యాచ్ కాగా, ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అదే సమయంలో ఆసియా ఖండంలో 50 టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియంగా గాలే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ రికార్డులకెక్కింది.

ఈ సిరీస్ ఇరు జట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలిచేందుకు అత్యంత కీలకం. ప్రస్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక డ్రాతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇరు జట్లు 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సిరీస్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "మేం ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు. 

శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా మాట్లాడుతూ.. "టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లం. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాం. ఇది ఒక చారిత్రక మైదానం. ఇలాంటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నాడు.

జట్ల వివరాలు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

శ్రీలంక: లహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో.
Advertisement
Shubman Gill
India vs Sri Lanka 1st Test
Galle International Cricket Stadium
India 600th Test Match
World Test Championship
Dhananjaya de Silva

More Telugu News