హత్యకు చాట్‌జీపీటీని వాడాడా?.. అమెరికాలో తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్!

Arjun Arvind Indian origin teenager kills mother and brother in USA
  • మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్‌లో ఈ దారుణ ఘటన
  • నిందితుడు అర్జున్ అరవింద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • కుటుంబాన్ని చంపడంపై చాట్‌జీపీటీలో సెర్చ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడి
  • నిందితుడిపై హత్య సహా పలు అభియోగాలు నమోదు
అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ భారత సంతతి టీనేజర్ తన కన్నతల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్ పట్టణంలో నివసిస్తున్న 17 ఏళ్ల అర్జున్ అరవింద్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అతని తల్లి సుధా వెంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ (14) ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.

మిడిల్‌సెక్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ మరియన్ ర్యాన్ కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈ హత్యలు జరిగాయి. ఇంట్లో ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన ఒక టీచర్ ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. ఆయన తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో కంగారుపడిన ఆయన, ఇంట్లో అంతా క్షేమంగా ఉన్నారో లేదో చూడాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఇంటికి చేరుకుని చూడగా, సుధా వెంకటేశన్ మృతదేహం బేస్‌మెంట్‌లో, సిద్ధార్థ్ మృతదేహం మొదటి అంతస్తులో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వారి శరీరాలపై తీవ్రమైన గాయాలున్నట్లు గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి అర్జున్, అతని తల్లికి చెందిన హోండా అకార్డ్ కారు కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున, వేలాండ్ అనే ప్రాంతంలోని ఓ పార్కింగ్ స్థలంలో కారుతో పాటు అర్జున్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్యల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్జున్ కొంతకాలంగా ఆందోళనకరంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. "కుటుంబాన్ని చంపడానికి సంబంధించిన ఐడియాలు, ఫాంటసీల" కోసం అతను ఇంటర్నెట్‌తో పాటు చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. 

'గోతిక్ నవల తరహా కథలను' సృష్టించేందుకు సాయం చేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను అడిగినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై రెండు హత్య కేసులు, దాడి, వాహనం దొంగతనం సహా పలు అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
Advertisement
Arjun Arvind
Acton Massachusetts murder
Indian origin teen murder
ChatGPT murder investigation
Sudha Venkatesan
Massachusetts double homicide

More Telugu News