సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు.. ఏటా డీఎస్సీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

Nara Chandrababu Naidu says welfare and development are like two bullocks with annual DSC and 20 lakh jobs
  • 2047 నాటికి స్వర్ణాంధ్ర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమ‌న్న ముఖ్య‌మంత్రి
  • సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
  • ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ
  • వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం
  • అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించి తీరుతామన్న సీఎం చంద్ర‌బాబు
అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం చేస్తూ 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేశామని, ఇక వికాసం నుంచి వైభవం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తామని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పనివాటిని కూడా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

సూపర్ సిక్స్ తో సంక్షేమ పాలన
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పెన్షన్లు పెంచి పేదలకు ఆర్థిక భద్రత కల్పించామని, కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నామని అన్నారు. ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు వరంగా మారిందని, అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని ఉన్నత వర్గాలు అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చేలా ‘పీ4’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, తద్వారా ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వివరించారు.

యువతే భవిష్యత్తు.. ఉద్యోగాల వెల్లువ
నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఉద్ఘాటించిన సీఎం, వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అధికారంలోకి రాగానే తొలి సంతకంతో 15,941 ఉపాధ్యాయ పోస్టులతో ‘మెగా డీఎస్సీ 2025’ను పారదర్శకంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఈ వేదిక నుంచి హామీ ఇచ్చారు. ఈ ఏడాది 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే రూ.24 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 11 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు.

రైతు సంక్షేమం.. జలయజ్ఞం
రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మే తమ ప్రభుత్వం, అన్నదాతలకు అండగా నిలుస్తోందని సీఎం అన్నారు. ‘పీఎం-కిసాన్–అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు.

పోలవరం, అమరావతిపై స్పష్టమైన హామీ
గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన పోలవరం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించామని చంద్రబాబు అన్నారు. రెండేళ్లలో 89 శాతం పనులు పూర్తి చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల త్యాగంతో నిర్మిస్తున్న ఈ రాజధానిలో ప్రస్తుతం రూ.50 వేల కోట్ల విలువైన పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.

సుపరిపాలన.. అభివృద్ధి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రెవెన్యూ సంస్కరణల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని సీఎం చెప్పారు. అవినీతి రహిత పాలన కోసం టెక్నాలజీని వినియోగిస్తున్నామని, ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా 1100కు పైగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, విద్యుత్ రంగంలో సంస్కరణలతో ఛార్జీలు పెంచకుండానే ప్రజలపై భారం తగ్గించామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. అందరి కృషితో వికసిత భారత్ నిర్మాణంలో భాగమవుతూ, స్వర్ణాంధ్రను సాధిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Nara Chandrababu Naidu
Andhra Pradesh Jobs
Mega DSC 2025
Amaravati Capital City
Polavaram Project
Super Six Schemes

More Telugu News