తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం: సీఎం రేవంత్‌

Revanth Reddy says Telangana moving from destruction to development
  • గోల్కొండలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్‌ రెడ్డి
  • ఆయుధం లేకుండా అహింసతో స్వాతంత్య్రం సాధించామని వ్యాఖ్య
  • దెబ్బతిన్న వ్యవస్థలను32 నెలల్లో గాడిలో పెట్టామని ప్రకటన
  • తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే 91 శాతం అధికమని వెల్లడి
  • రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వ్యాఖ్య
  • బలమైన ప్రజాస్వామిక భారత్‌ నిర్మాణానికి పిలుపు
గోల్కొండ కోటలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం భారత స్వాతంత్య్ర పోరాటమని అన్నారు. అహింసతోనూ విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.

స్వాతంత్య్రం జీవనానికి ఆధారమని, దానికి వెల కట్టలేమని గాంధీజీ చెప్పారని రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశంలోని వివిధ రంగాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామని చెప్పారు. తమ సంక్షేమ పథకాలను కేవలం ఆర్థిక లెక్కలతో చూడటం లేదని స్పష్టం చేశారు. సంక్షేమంలో మానవీయత ఉందని, పేదల పట్ల బాధ్యత ఉందని అన్నారు. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపనతో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం లేదా మొక్కుబడిగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

32 నెలల్లో ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 91 శాతం అధికంగా ఉందని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నది తమ ప్రభుత్వ నమ్మకమని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని, శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన బలమైన ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మించడమే సమరయోధులకు నిజమైన నివాళి అని అన్నారు. ప్రతి పౌరుడికి సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అందేలా నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కర్తవ్యనిష్ఠతో, అంకితభావంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Advertisement
Revanth Reddy
Telangana Independence Day
Golconda Fort Flag Hoisting
Telangana Per Capita Income
Telangana Farmer Welfare
Telangana Development News

More Telugu News