జగపతిబాబు - లయ కాంబినేషన్ లో రూపొందిన సినిమానే 'వదలా'. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. జగపతిబాబు - లయ కాంబినేషన్ లో చాలాకాలం తరువాత వచ్చిన సినిమా కావడంతో, ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. టైటిల్ పరంగా కూడా ఈ సినిమా అందరిలో కుతూహలాన్ని పెంచింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 14వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది.

యోగి (జగపతిబాబు) ఒక శ్రీమంతుడు .. మంచి పేరున్న డాక్టర్. భార్య ప్రియ (లయ) పిల్లలు అప్పూ .. చింటూ .. ఇదే అతని ఫ్యామిలీ. ప్రియ తండ్రి కూడా వాళ్లతో పాటే ఉంటూ ఉంటాడు. కాకపోతే ఆయన అనారోగ్య కారణాల వలన, వీల్ ఛైర్ కి పరిమితమై ఉంటాడు .. మాట్లాడలేడు కూడా. యోగి - ప్రియ అన్యోన్య దాంపత్యం గురించి ఆ అపార్టుమెంటులో అందరికీ తెలుసు. ఒక రోజున ప్రమాదానికి గురైన 'అముద' (హృతిక శ్రీనివాస్)ను, యోగి తన హాస్పిటల్ కి తీసుకొస్తాడు. దగ్గరుండి ఆమెకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆ తరువాత యోగి ఇంటికి ఎదురు ఫ్లాట్ లోనే ఆమె దిగుతుంది.

యోగి భార్యాపిల్లలతో పరిచయం పెంచుకుని, ఆ ఫ్యామిలీకి 'అముద' మరింత చేరువవుతుంది. యోగి - ప్రియ ప్రేమగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. వాళ్లకి  ఆనందాన్ని దూరం చేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రియ తండ్రిని భయపెడుతూ ఉంటుంది. కొత్త ఫోన్ నంబర్లతో యోగికి మెసేజ్ చేయడం .. బొకేలు పంపించడం .. పెయింటింగ్స్ పంపించడం చేస్తుంటుంది. దాంతో యోగిపై నిదానంగా ప్రియకి అనుమానం పెరగడం మొదలవుతుంది.

ఇదిలా ఉండగా, పదేళ్ల  క్రితం 'దీపావళి' పండుగ రోజున సిలిండర్ పేలడం వలన చనిపోయిన నివాస్ (అవసరాల శ్రీనివాస్) ఫ్యామిలీకి సంబంధించిన కేసులో మళ్లీ కదలిక మొదలవుతుంది. ఆ కేసుకి సంబంధించిన ఒక 'క్లూ' పోలీస్ ఆఫీసర్ పద్మాకర్ కి తెలుస్తుంది. నివాస్ ఎవరు? ఆయన ఫ్యామిలీ అంతా కాలిపోవడానికి కారకులు ఎవరు? యోగికి 'అముద' ఎందుకు దగ్గరవుతుంది? ప్రియ ఆమె పిల్లలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.

దీపావళి రోజున జరిగిన బ్లాస్టింగ్ లో ఒక ఫ్యామిలీ అంతా చనిపోవడం గురించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. పోలీస్ ఆఫీసర్ పద్మాకర్ తన దర్యాప్తును కొనసాగిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలోనే యోగి -ప్రియ అనే ఇద్దరు దంపతుల మధ్యలోకి 'అముద' అనే పాత్ర రావడంతో, ఈ కథ పట్ల ఆడియన్స్ కి ఆసక్తి పెరుగుతుంది. ఆ బ్లాస్టింగ్ కి .. ఈ ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటా? అనే ఒక ఆలోచన ఆడియన్స్ ను వెంటాడుతూ ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నాడు. 

 యోగి తనకి మాత్రమే దక్కాలనే ఆలోచనతో 'అముద' ముందుకు వెళుతుంటుంది. ఆమె ఉద్దేశం ఏమిటి? అనేది ఈ కథలో కీలకంగా మారుతుంది. ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. పెళ్లైన కొంతకాలానికి వేరేవారితో నడిచే ప్రేమవ్యవహారం చుట్టూ ఈ కథ నవడబోతుందని ప్రేక్షకులు అనుకుంటారు. అలాంటి ఆలోచనను రేకెత్తిస్తూ దర్శకుడు  సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. 

డబ్బున్న వివాహితుడి పట్ల మనసు పారేసుకున్న యువతి చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులు భావిస్తారు. కానీ దర్శకుడు ఇక్కడే ఈ కథను మలుపు తిప్పాడు. అయితే ఆ మలుపు ఆడియన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించకపోగా, ఇబ్బందిని కలిగిస్తుంది. ఆడియన్స్ గెస్ చేయని విధంగా కథను మలుపు తిప్పడం ఎప్పుడూ థ్రిల్ చేస్తుంది. అయితే ఆ మలుపు సబబుగా .. సహజత్వానికి దగ్గరగా అనిపించాలి .. ఎబ్బెట్టుగా అనిపించకూడదు. ఈ కథలోని ట్విస్ట్ అలాగే అనిపిస్తుంది. 

'వదలా' అనే టైటిల్ మన కంట్లోపడగానే ఇదేదో హారర్ టచ్ ఉన్న సినిమా అనుకోవడం సహజం. లేదంటే శాడిజంతో ఒక అమ్మాయిని వేధించడం చుట్టూ తిరిగుతుందేమో అనుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఆస్తిపాస్తులపై ఒక యువతీ కన్నేసి, శ్రీమంతుడిని ట్రాప్ లోకి లాగడమేమో అనుకోవడం కూడా సహజమే. కానీ ఈ సినిమాను చూసిన తరువాత, ఈ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. 

 ఒక డాక్టర్ గా 'అముద' పాత్ర విషయంలో యోగి తీసుకునే కేర్ అతిగా ఉంటుంది. ఏ రకంగాను హాని తలపెట్టలేని యోగి మామగారి పాత్రను 'అముద' హింసించడం కూడా అర్థం లేని పనిగా కనిపిస్తుంది. ఇక తమ వివాహ వార్షికోత్సవం రోజున యోగి పట్ల 'ప్రియ' సీరియస్ కావడం కూడా కృతకంగా అనిపిస్తుంది. తనకి దొరికిపోయిన 'అముద'ను ఆమె ఫ్లాట్ కి పోలీస్ ఆఫీసర్ పద్మాకర్ తీసుకుని వెళ్లడం సహజత్వానికి దూరంగా నిలుస్తుంది. ఇలాంటి సన్నివేశాలు కథలో ఇన్వాల్వ్ కాకుండా అడ్డుపడుతూ ఉంటాయి.

 జగపతిబాబు - లయ - హృతిక శ్రీనివాస్ నటన ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ  .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. కథగా చూసుకుంటే పాతదే. స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా రొటీన్ గానే ఉంటుంది. 'ఓహో అదా విషయం' అని ప్రేక్షకులకు ఎక్కడి నుంచి అయితే అనిపిస్తుందో, అక్కడి నుంచి ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్ కనిపెట్టేస్తూ ఉంటారు. అందుకు తగినట్టుగానే సన్నివేశాలు వచ్చి పడుతుంటాయి. చాలావరకూ కథ నాలుగు గోడల మధ్యనే లాగించేస్తూ వెళ్లారు. ఉద్దేశ పూర్వకంగా గతాన్ని వర్తమానంతో కలిపి చూపించేయడం కూడా కాస్త అయోమయాన్ని కలిగిస్తుంది.

'వదలా' అంటే ఆ స్థాయిలో వెంటాడే కథాకథనాలు ఉండాలి. కదలకుండా బలంగా పట్టుకునే పాత్రలు ఉండాలి. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో కూడిన సన్నివేశాలతో పట్టుకోవాలి. కానీ ఆ స్థాయిలో ఈ కంటెంట్ ప్రభావితం చేయలేదనే చెప్పాలి.