శాంతి స్థాపనలో మోదీ పాత్ర అభినందనీయం: ఇరాన్ అధ్యక్షుడి ప్రశంస
- ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్
- బ్రిక్స్ వంటి వేదికలపై సహకారాన్ని విస్తరించుకోవడంపై ఇరు నేతల చర్చ
- చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం
- పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై ఇరు దేశాధినేతల అభిప్రాయ మార్పిడి
ఇటీవల భారత్ విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం పట్ల పెజెష్కియన్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల ద్వారా ఇరు దేశాల మధ్య సహకారం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను గుర్తుచేస్తూ.. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రవాణా, అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రాంతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదిరిన ఒప్పందాలకు ఇరాన్ కట్టుబడి ఉందని పెజెష్కియన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. శాశ్వత శాంతి, భద్రతల స్థాపన కోసం ఇతర పక్షాలు కూడా బాధ్యతాయుతంగా నిబంధనలను అమలు చేయాలని ఆయన కోరారు. దురాక్రమణలను నిరోధించడంలో అంతర్జాతీయ సమాజం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వేదికలపై అనేక అంశాల్లో ఇరు దేశాల అభిప్రాయాలు ఏకీభవించడం వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు, స్వేచ్ఛా నౌకాయాన పరిరక్షణకు దోహదపడే ఒప్పందాలను ప్రధాని మోదీ గతంలోనూ స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.