వియత్నాంలో రచ్చర‌చ్చ చేసిన భారతీయ కుటుంబం.. ఇదిగో వీడియో!

Indian family creates ruckus in Vietnam restaurant video viral
  • వియత్నాంలోని భారత రెస్టారెంట్‌లో ఓ ఇండియన్ ఫ్యామిలీ వీరంగం
  • పిల్లలు అల్లరి చేస్తుంటే ఆపమన్నందుకు సిబ్బందితో కుటుంబం వాగ్వాదం
  • తాము ఇన్‌ఫ్లుయెన్సర్లం అంటూ బెదిరించి, ఆస్తి నష్టం చేశారని రెస్టారెంట్ ఆరోపణ
  • 'రెస్టారెంట్ ఆటస్థలం కాదు' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన యాజమాన్యం
వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అక్కడి ప్రఖ్యాత భారతీయ రెస్టారెంట్‌లో సిబ్బందిని బెదిరించడమే కాకుండా, ఆస్తి నష్టం చేశారని రెస్టారెంట్ యాజమాన్యం ఆరోపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హోచిమిన్ సిటీలోని టూరిస్ట్ ఏరియా అయిన డిస్ట్రిక్ట్ 1లో 'బాంబే బైట్స్ హెచ్‌సీఎం' అనే భారతీయ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వచ్చిన ఓ భారతీయ కుటుంబంలోని పిల్లలు డైనింగ్ ఏరియాలో టిష్యూలు విసురుతూ అల్లరి చేయగా, సిబ్బంది మర్యాదపూర్వకంగా వారి తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించారు. పిల్లలను నియంత్రించాలని కోరారు. అయితే, వారు సహకరించకపోగా, రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో ఆ కుటుంబం తమపై నోరు పారేసుకోవడంతో పాటు ఆస్తిని ధ్వంసం చేసిందని రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరోపించారు. తాము 'ఇన్‌ఫ్లుయెన్సర్లం' అని చెప్పుకుంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉందని తెలిపారు.

"ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. రెస్టారెంట్ ఆటస్థలం కాదు. మా సిబ్బంది మీ కోపానికి, అహంకారానికి లక్ష్యాలు కారు. ఇన్‌ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన ఎవరూ కనీస మర్యాదను మించి ప్రవర్తించలేరు. పిల్లలకు బాధ్యత నేర్పించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం" అని ఐశ్వర్య తన పోస్టులో ఘాటుగా రాశారు. ఆతిథ్యం ఇవ్వడం తమ వృత్తి అని, కానీ కనీస మర్యాద పాటించడం అందరి బాధ్యత అని రెస్టారెంట్ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే ఉంటుంది", "వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. పర్యాటకుల ప్రవర్తన, బహిరంగ ప్రదేశాల్లో తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఆరోపణలపై సదరు భారత కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 
Indian family
Vietnam restaurant incident
Bombay Bites HCM
Ho Chi Minh City
Aishwarya Khanna Singh
Indian tourists behavior

More Telugu News