ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత చాలామంది ఆహారం ఎంచుకునే తీరు పూర్తిగా మారిపోయింది. ప్యాకెట్‌పై ‘హై ప్రొటీన్‌’, ‘నేచురల్‌’, ‘హెల్తీ’ వంటి పదాలు కనిపిస్తే చాలు.. అది మంచిదే అనుకుని కొనేస్తున్నారు. కానీ బయటకు ఆరోగ్యకరంగా కనిపించే కొన్ని ఆహారాలే గుండెకు నెమ్మదిగా ముప్పు తెచ్చిపెడుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల ప్రకారం.. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్‌తో వచ్చే చాలా మందిలో ఒకే తరహా ఆహారపు అలవాట్లు కనిపిస్తున్నాయి. ఆరోగ్యకరమనే నమ్మకంతో రోజూ తింటున్న కొన్ని ప్యాకెట్‌ ఆహారాల్లోనే అదనపు చక్కెర, శాచురేటెడ్‌ కొవ్వు ఎక్కువగా ఉంటోంది. రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే భవిష్యత్‌లో గుండెపోటు, స్ట్రోక్‌ వంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రొటీన్‌ ఫుడ్‌ ట్రెండ్‌ బాగా పెరిగింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లో రెడీమేడ్‌ ప్రొటీన్‌ షేక్‌లు పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. అయితే వాటిలో చాలావరకు చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఉత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు కూడా కలుపుతారు. ఇవి పేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు తరచూ తినాలనే కోరికను పెంచే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పానీయాల కంటే పప్పుధాన్యాలు, ఇతర సహజ ప్రొటీన్‌ ఆహారాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

గ్రానోలా కూడా ఆరోగ్యకరమైన అల్పాహారంగా ప్రచారం పొందింది. కానీ మార్కెట్‌లో దొరికే చాలా ఉత్పత్తులు రుచి కోసం అధికంగా ప్రాసెస్‌ చేస్తారు. అందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు కలుపుతారు. ఫైబర్‌ కూడా తగ్గిపోతుంది. అందుకే కొనేముందు ప్యాకెట్‌పై ఉన్న పదార్థాల జాబితా తప్పకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే ఇంట్లోనే గ్రానోలా తయారు చేసుకోవడం లేదా డ్రైఫ్రూట్స్‌, పండ్లు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

కొబ్బరి నూనె కూడా చాలామందికి ఆరోగ్యకరమైన నూనెగానే తెలుసు. ముఖ్యంగా శాకాహార ఉత్పత్తుల్లో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. కానీ ఇందులో శాచురేటెడ్‌ కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ అదే నూనెతో వంటలు చేస్తే కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ బార్లు, చిప్స్‌ వంటి ప్యాకెట్‌ ఫుడ్స్‌లో కూడా కొబ్బరి నూనె ఉండే అవకాశం ఉన్నందున లేబుల్‌ చదివి కొనడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.