గంభీర్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ బీభత్సమైన ట్రోల్.. 'అలాంటి రిజల్ట్ ఇవ్వడం ఒక అద్భుతమైన టాలెంట్' అంటూ సెటైర్లు!
- ఐర్లాండ్ చేతిలో టీమిండియా 0-2తో టి20 సిరీస్ ఓటమి
- ఎక్స్ వేదికగా కౌంటర్లు వేసిన ఐస్‌లాండ్ క్రికెట్
- గంభీర్‌ను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకునే ఉద్దేశం లేదంటూ సెటైర్
- గంభీర్ అసాధారణ ప్రతిభకు నిదర్శనమంటూ వ్యంగ్యాస్త్రాలు
- గంభీర్ సారథ్యంలో వరుసగా 16 సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా
- గతంలో ఐర్లాండ్‌పై ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్
- చరిత్రలో తొలిసారి దారుణ పరాజయం
ఐస్‌లాండ్ క్రికెట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. "మేము గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదని స్పష్టం చేస్తున్నాం. అయితే ఆయనలో కచ్చితంగా అద్భుతమైన టాలెంట్ ఉంది. అంతటి స్టార్ భారత ఆటగాళ్లను పెట్టుకుని, ఐర్లాండ్ గడ్డపై ఇలాంటి ఫలితాలు ఇవ్వడం నిజంగా ఒక అసాధారణమైన బహుమతి (టాలెంట్)" అంటూ విపరీతమైన వ్యంగ్యంతో పోస్ట్ పెట్టింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి వరల్డ్ కప్ విన్నర్లతో కూడిన స్టార్-స్టడెడ్ టీమిండియా.. ఐర్లాండ్ బౌలింగ్ ధాటికి కుప్పకూలడాన్ని ఉద్దేశించి ఈ క్లాసిక్ జబ్ విసిరింది.
గౌతమ్ గంభీర్ 2024లో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారత్ వరుసగా 16 టీ20 సిరీస్‌లలో అజేయంగా నిలిచింది. గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంక (3-0), బంగ్లాదేశ్ (3-0)లను వైట్‌వాష్ చేయడమే కాకుండా, సౌతాఫ్రికా (3-1), ఇంగ్లండ్ (4-1), ఆస్ట్రేలియా (2-1), న్యూజిలాండ్ (4-1)లపై సిరీస్ విజయాలు సాధించింది. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ రికార్డుకు ఆదివారం ఐర్లాండ్ బ్రేక్ వేసింది.
గతంలో ఐర్లాండ్‌తో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన రికార్డు ఉన్న భారత్.. 2023 తర్వాత మొదటిసారి ఐరిష్ గడ్డపై అడుగుపెట్టి ఘోరంగా విఫలమైంది. మొదటి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచిన ఐర్లాండ్, రెండో మ్యాచ్‌లోనూ అదే ఊపుతో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్లను ఓడించి ఐర్లాండ్ చరిత్ర సృష్టిస్తే.. గంభీర్ కోచింగ్ లోపాలను వేలెత్తి చూపుతూ నెటిజన్లు, క్రికెట్ బోర్డులు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నాయి.