మహిళల క్రికెట్‌లో దీప్తి శర్మ సరికొత్త చరిత్ర.. జులన్ రికార్డు బ్రేక్
- మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో దీప్తి శర్మ ప్రపంచ రికార్డ్
- జులన్ గోస్వామి రికార్డును అధిగమించిన భారత ఆల్ రౌండర్
- అంతర్జాతీయంగా 356 వికెట్లు పడగొట్టిన దీప్తి
- టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఈ ఘనత
- బెత్ మూనీ వికెట్‌తో ఈ మైలురాయిని అందుకున్న దీప్తి శర్మ
లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో దీప్తి ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ ప్రపంచ రికార్డుకు కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్న ఆమె, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బెత్ మూనీని అవుట్ చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నారు. దీప్తి సంధించిన బంతిని మూనీ స్లాగ్ స్వీప్ చేయగా, లాంగ్ ఆన్ వద్ద రాధా యాదవ్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకోవడంతో ఈ రికార్డు సాకారమైంది.
ఈ వికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో దీప్తి తీసిన వికెట్ల సంఖ్య 356కి చేరుకుంది. తద్వారా ఇప్పటివరకు 355 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగిన జులన్ గోస్వామిని ఆమె వెనక్కి నెట్టారు. 28 ఏళ్ల దీప్తి శర్మ కేవలం 278 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించగా, జులన్ 284 మ్యాచ్‌లలో 355 వికెట్లు పడగొట్టారు.
ఆగ్రాకు చెందిన దీప్తి శర్మ భారత జట్టులో అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నారు. ఇదే టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆమె తన సత్తా చాటారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు దీప్తి 6 టెస్టుల్లో 22, 124 వన్డేల్లో 166, 148 టీ20లలో 168 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ, ఇంగ్లండ్‌కు చెందిన కేథరీన్ సివర్-బ్రంట్ వంటి మేటి క్రీడాకారిణులను అధిగమించి దీప్తి అగ్రస్థానంలో నిలిచారు.