ఫిఫా వరల్డ్ కప్: గ్రూప్ దశ ముగిసింది.. అసలు సిసలు సమరం ఇప్పుడే!
- ఫిఫా వరల్డ్ కప్ 2026లో నాకౌట్ పోరుకు రంగం సిద్ధం
- ప్రపంచకప్ చరిత్రలో 19 గోల్స్‌తో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మెస్సీ రికార్డ్
- ఆరు వేర్వేరు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో ఘనత
- సంచలనం సృష్టించి నాకౌట్ చేరిన కేప్ వర్దె.. నిరాశగా వెనుదిరిగిన ఉరుగ్వే, టర్కీ
- గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ, రొనాల్డో, ఎంబాపే, హాలాండ్ మధ్య తీవ్ర పోటీ
ఈ టోర్నీ ఆరంభం నుంచి అందరి దృష్టీ దిగ్గజ ఆటగాళ్లైన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కిలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హాలాండ్‌పైనే నిలిచింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ స్టార్లు మైదానంలో మ్యాజిక్ చేశారు.
ముఖ్యంగా, తమ కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఆడుతున్నారని భావిస్తున్న మెస్సీ (39), రొనాల్డో (41) అద్భుత ప్రదర్శనలతో చరిత్రను తిరగరాశారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 19కి పెంచుకుని, ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. మరోవైపు, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆరు వేర్వేరు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఈ దిగ్గజాలకు పోటీగా యువతరం కూడా సత్తా చాటుతోంది. ఫ్రాన్స్ సంచలనం కిలియన్ ఎంబాపే తన ఖాతాలో మరో నాలుగు గోల్స్ వేసుకుని, మొత్తం 16 ప్రపంచకప్ గోల్స్‌తో రికార్డుల దిశగా దూసుకెళుతున్నాడు.
తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్, గ్రూప్ దశలోనే నాలుగు గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ రేసులో తాను కూడా ఉన్నానని నిరూపించుకున్నాడు. దీంతో ఈ నలుగురి మధ్య గోల్డెన్ బూట్ కోసం జరిగే పోటీ టోర్నీకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వరల్డ్ కప్‌లో కొన్ని జట్లు సంచలనాలు సృష్టిస్తే, మరికొన్ని తీవ్రంగా నిరాశపరిచాయి. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేప్ వెర్డే జట్టు, అద్భుతమైన డిఫెన్స్, అసాధారణమైన పోరాట పటిమతో బలమైన ప్రత్యర్థులను సైతం వెనక్కి నెట్టి నాకౌట్ దశకు చేరింది. గోల్ కీపర్ వోజిన్హా అద్భుత సేవింగ్‌లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు, ఫెడెరికో వాల్వర్డే, డార్విన్ నూనెజ్ వంటి స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగిన ఉరుగ్వే, వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. డార్క్ హార్స్‌గా భావించిన టర్కీ కూడా పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక నాకౌట్ దశలో కొన్ని ఆసక్తికరమైన పోరులు అభిమానులను అలరించనున్నాయి. బలమైన డిఫెన్స్‌కు పేరుగాంచిన నెదర్లాండ్స్, మొరాకో మధ్య జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
అలాగే, ఫేవరెట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్‌కు, క్రమశిక్షణతో కూడిన ఆటతీరు కనబరిచే స్వీడన్‌కు మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. బ్రెజిల్ అటాకింగ్‌కు, జపాన్ తనదైన శైలి ఆటకు మధ్య జరిగే మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రూప్ దశలో అద్భుత క్షణాలను అందించిన ఈ టోర్నీ, నాకౌట్ దశలో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.