ఆగని మెస్సీ గోల్స్ వేట.. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు!

Lionel Messi Unstoppable Goal Hunt New Record as First Player in FIFA World Cup History
ఫిఫా వరల్డ్ కప్‌లో వరుసగా 7 మ్యాచ్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ
జోర్డాన్‌పై ఫ్రీకిక్‌తో గోల్ చేసి ఈ అరుదైన రికార్డును నెలకొల్పిన సాక‌ర్ స్టార్‌
వరల్డ్ కప్స్‌లో తన మొత్తం గోల్స్ సంఖ్యను 19కి పెంచుకున్న వైనం
ఆరు ఫిఫా వరల్డ్ కప్‌లు ఆడిన ఏకైక పురుష ఆటగాడిగానూ మరో ఘనత
గోల్డెన్ బూట్ రేసులోనూ ఇతర స్టార్ ఆటగాళ్ల కంటే ముందున్న మెస్సీ
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచ్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం డల్లాస్ స్టేడియంలో జోర్డాన్‌తో జరిగిన ఫైనల్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు.

ఈ మ్యాచ్‌లో మెస్సీకి మొదట తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఆట 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆట 80వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా విజయాన్ని ఖాయం చేయడమే కాకుండా తన రికార్డుల జాబితాను మరింత పెంచుకున్నాడు. 

ఈ గోల్‌తో ప్రపంచకప్ టోర్నమెంట్లలో మెస్సీ మొత్తం గోల్స్ సంఖ్య 19కి చేరింది. తద్వారా ఆల్-టైమ్ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. అంతేగాక‌ ప్రస్తుత గోల్డెన్ బూట్ రేసులో కైలియన్ ఎంబాపే, ఉస్మాన్ డెంబెలె, వినిసియస్ జూనియర్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్ ఆటగాళ్ల కంటే రెండు గోల్స్ ఆధిక్యంలో ఉన్నాడు.

మెస్సీ గోల్స్ పరంపర 2022 ఖతార్ వరల్డ్ కప్‌లోని రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్, క్రొయేషియాతో సెమీఫైనల్‌లో పెనాల్టీల ద్వారా గోల్స్ చేశాడు. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లోనూ పెనాల్టీతో పాటు అదనపు సమయంలో మరో గోల్ కొట్టాడు. ప్రస్తుత టోర్నీలో అల్జీరియాపై హ్యాట్రిక్‌, ఆస్ట్రియాపై డబుల్ గోల్స్‌తో ఈ పరంపరను కొనసాగించాడు.

ఇది మెస్సీకి ఆరవ ఫిఫా వరల్డ్ కప్ (2006, 2010, 2014, 2018, 2022, 2026). ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న ఏకైక పురుష ఆటగాడిగా కూడా మెస్సీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాకౌట్ రౌండ్లకు అర్జెంటీనా చేరుకోవడంతో మెస్సీ తన రికార్డులను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.
Lionel Messi
FIFA World Cup Record
Argentina Football Team
Messi 19 World Cup Goals
Golden Boot Race
Messi Six World Cups

More Telugu News