టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియురాలు, మోడల్ మహీకా శర్మను హార్దిక్ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పాపిటలో సిందూరంతో మహీకా శర్మ కనిపిస్తున్న ఒక ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ కావడమే ఈ ఊహాగానాలకు కారణమైంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలో హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ పక్కపక్కనే నిల్చుని ఉన్నారు. వారి చేతులను ఒక వృద్ధురాలు పట్టుకుని ఉండగా, మహీకా పాపిటలో సిందూరం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటో బయటకు రావడంతో వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, అందుకే మహీకా సంప్రదాయబద్ధంగా సిందూరం ధరించిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది గంటల్లోనే ఈ ఫొటో వైరల్ కావడంతో హార్దిక్ పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వారి వివాహం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ప్రచారంపై హార్దిక్ పాండ్యా గానీ, మహీకా శర్మ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కేవలం ఒక ఫోటోను ఆధారం చేసుకుని వస్తున్న ఈ వార్తలను నమ్మలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది కాలంగా తమ సంబంధం గురించి బహిరంగంగానే ఉంటూ వస్తున్న ఈ జంట, నిజంగా పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని కచ్చితంగా అభిమానులతో పంచుకునే వారని చాలామంది భావిస్తున్నారు. బహుశా ఏదైనా ప్రైవేట్ ట్రిప్‌లో భాగంగా వారు కలిసిన వృద్ధురాలితో ఈ ఫొటో తీసుకుని ఉండవచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

2024 జులైలో సెర్బియన్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం నిరంతరం మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. 2020లో వివాహం చేసుకున్న ఈ జంటకు అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత ఇద్దరూ కలిసి తమ కుమారుడి బాధ్యతలను చూసుకుంటున్నారు.

రిలేషన్‌షిప్‌లో హార్దిక్, మహీకా 
2025 సెప్టెంబర్‌లో మహీకా శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో హార్దిక్ పాండ్యా కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాతి నెలలోనే అంటే అక్టోబర్‌లో ఈ జంట తమ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి తరచుగా తమ ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు టీ20 ప్రపంచ కప్ 2026 వంటి అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా హార్దిక్‌ను ఉత్సాహపరుస్తూ మహీకా స్టేడియంలో కనిపించింది. ప్రస్తుతానికి వైరల్ ఫొటోతో పెళ్లిపై చర్చ జరుగుతున్నప్పటికీ, వారి వివాహంపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదనేది వాస్తవం.