ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ నమోదైన ఎడిషన్‌గా, అదే సమయంలో అత్యధిక ప్రేక్షకులు హాజరైన టోర్నీగా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాకౌట్ దశ ప్రారంభం కాకముందే ఈ చారిత్రక మైలురాళ్లను చేరుకోవడం ఈ టోర్నమెంట్ ప్రత్యేకతను చాటుతోంది.

చరిత్రలో అత్యధిక గోల్స్ నమోదైన టోర్నీ! 
నేడు సహ-ఆతిథ్య దేశమైన అమెరికా, టర్కీ మధ్య జరిగిన గ్రూప్ డి మ్యాచ్ ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఈ మ్యాచ్‌లో అమెరికా డిఫెండర్ ఆస్టన్ ట్రస్టీ గోల్ కొట్టడంతో ఈ టోర్నమెంట్‌లో మొత్తం గోల్స్ సంఖ్య 173కు చేరింది. దీంతో 2022లో ఖతార్ వేదికగా మొత్తం 64 మ్యాచ్‌లలో నమోదైన 172 గోల్స్ రికార్డు బద్దలైంది. విశేషమేమిటంటే.. ఈసారి కేవలం 59వ మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని అందుకోవడం. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టర్కీ 3-2 తేడాతో గెలవడంతో టోర్నీ మొత్తం గోల్స్ సంఖ్య 177కు పెరిగింది.

గతంలో 32 జట్లతో నిర్వహించిన ప్రపంచకప్‌ను ఈసారి 48 జట్లకు విస్తరించడమే ఈ గోల్స్ వర్షానికి ప్రధాన కారణం. దీనివల్ల మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 64 నుంచి 104కి పెరిగింది. ఫలితంగా గోల్స్ చేయడానికి, కొత్త రికార్డులు నెలకొల్పడానికి మరిన్ని అవకాశాలు లభించాయి.

ప్రేక్షకుల రికార్డు బద్దలు! 
గోల్స్‌లోనే కాదు ప్రేక్షకుల హాజరులోనూ ఫిఫా వరల్డ్ కప్ 2026 చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మొత్తం 36,05,357 మంది అభిమానులు స్టేడియాలకు తరలివచ్చి మ్యాచ్‌లను వీక్షించారు. ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం. 1994లో అమెరికాలో జరిగిన ఎడిషన్‌లో నమోదైన 35 లక్షల మంది హాజరు రికార్డును ఈ టోర్నీ అధిగమించింది. అంతేగాక‌ జూన్ 17న ఒక్కరోజే నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,81,223 మంది హాజరై, అత్యధిక రోజువారీ హాజరు రికార్డును కూడా నెలకొల్పింది.

ఫిఫా అధ్యక్షుడు హర్షం  
ఈ అద్భుతమైన విజయాలపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో హర్షం వ్యక్తం చేశారు. "ఖతార్ రికార్డును అధిగమించడం ఈ టోర్నమెంట్ విజయాన్ని సూచిస్తోంది. 2026 ప్రపంచకప్‌ను ఇప్పటికే మరపురానిదిగా మార్చిన అటాకింగ్ నైపుణ్యానికి ఇది నిదర్శనం" అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. "ప్రేక్షకుల రికార్డు ఫుట్‌బాల్ పట్ల అభిమానులకు ఉన్న ప్రేమను, ప్రజలను ఏకం చేసే ఆటకున్న శక్తిని ప్రతిబింబిస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి మా 16 ఆతిథ్య నగరాల్లో పండుగ వాతావరణం నింపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇంకా అత్యుత్తమ ప్రదర్శనలు రాబోతున్నాయి, మరిన్ని రికార్డులు నెలకొల్పుతాం" అని ఆయన తెలిపారు.