ఫిఫా వరల్డ్ కప్‌లో ఆల్‌టైమ్ రికార్డ్: టికెట్ల ధరలు ఆకాశాన్నంటినా.. పోటెత్తిన ఫుట్‌బాల్ ప్రేమికులు

FIFA World Cup 2026 breaks all-time attendance records despite high ticket prices
  • ప్రేక్షకుల హాజరులో ఫిఫా ప్రపంచకప్ సరికొత్త రికార్డు
  • 56 మ్యాచ్‌లకే 36 లక్షల మందికి పైగా హాజరు
  • 1994లో అమెరికాలో నెలకొల్పిన రికార్డు బద్దలు
  • అధిక టికెట్ ధరలు, వీసా సమస్యలు ఉన్నప్పటికీ పోటెత్తిన అభిమానులు
  • 99 శాతం ఆక్యుపెన్సీతో కిక్కిరిసిన స్టేడియాలు
సాకర్ క్రేజ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. టికెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరినా, వీసా నిబంధనలు ఇబ్బంది పెడుతున్నా అభిమానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 'ఫిఫా వరల్డ్ కప్ 2026' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన టోర్నీగా ఇది సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే 32 ఏళ్ల క్రితం నాటి రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూన్ 25న జర్మనీ, ఈక్వెడార్ దేశాల మధ్య జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్ సందర్భంగా ఈ మైలురాయి నమోదైనట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన 56 మ్యాచ్‌లకు కలిపి మొత్తం ప్రేక్షకుల సంఖ్య 36,05,357కు చేరింది. దీంతో 1994లో అమెరికాలోనే జరిగిన వరల్డ్ కప్‌లో నమోదైన పాత రికార్డు (35,87,538 మంది) బద్దలైంది. అప్పట్లో టోర్నీ మొత్తం మీద కేవలం 52 మ్యాచ్‌లు మాత్రమే జరగగా, ఈసారి జట్ల సంఖ్య 48కి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 104కు చేరింది. ఇంకా సగం కంటే ఎక్కువ మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో.. టోర్నీ ముగిసే సమయానికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లలో స్టేడియాలు సగటున 99 శాతానికి పైగా నిండిపోతుండటం విశేషం. జూన్ 16న జరిగిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను ఏకంగా 2,81,000 మందికి పైగా వీక్షించి, ఒకే రోజు అత్యధిక మంది చూసిన మ్యాచ్‌లుగా సరికొత్త రికార్డు సృష్టించారు.

అయితే ఈ విజయాల వెనుక తీవ్రమైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫిఫా అనుసరిస్తున్న డైనమిక్ ప్రైసింగ్ పాలసీ వల్ల టికెట్ల ధరలు వేల డాలర్లకు చేరుకున్నాయి. రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ప్రారంభ ధర 800 డాలర్లు (దాదాపు రూ. 66,000) పలుకుతోంది. సాధారణ అభిమానుల కోసం కేటాయించిన 60 డాలర్ల టికెట్లు ఉన్నప్పటికీ.. హోటల్ చార్జీలు, ప్రయాణ ఖర్చులు భారంగా మారాయని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే అభిమానులకు అమెరికా వీసా నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారాయి.

ఈ లోపాలు, ఆర్థిక పరమైన సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. మైదానంలో ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన, స్టేడియంలో లభిస్తున్న అద్భుతమైన వాతావరణం టోర్నీని విజయవంతం చేస్తున్నాయని ఫిఫా అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండటంతో, రాబోయే రోజుల్లో స్టేడియాలు మరిన్ని రికార్డులకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
FIFA World Cup 2026
Football Attendance Records
MetLife Stadium New Jersey
FIFA Dynamic Pricing
USA Canada Mexico World Cup
Football Fan Turnout

More Telugu News