భారత అగ్రశ్రేణి అథ్లెట్, తెలుగు తేజం జ్యోతి యర్రాజి అద్భుతమైన పునరాగమనం చేసింది. తీవ్ర గాయం కారణంగా ఏడాదికి పైగా ట్రాక్ కు దూరమైన ఆమె, బరిలోకి దిగిన తొలి రేసులోనే 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించి తన సత్తా చాటింది. బుధవారం ప్రారంభమైన 65వ నేషనల్ ఇంటర్-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించింది.

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో పాల్గొన్న జ్యోతి, 13.14 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని పూర్తి చేసి ఏషియన్ గేమ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన 26 ఏళ్ల జ్యోతి, గతంలో మోకాలికి తగిలిన తీవ్ర గాయం కారణంగా సుదీర్ఘకాలం ఆటకు దూరమైంది. రిలయన్స్ ఫౌండేషన్ స్పోర్ట్స్‌లో పునరావాసం పొందిన తర్వాత ఆమె పాల్గొన్న తొలి టోర్నమెంట్ ఇదే.

గతేడాది హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో వివాదం అనంతరం రజత పతకం గెలిచిన జ్యోతి, 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు హోల్డర్‌గా కొనసాగుతోంది. ఈసారి 100 మీటర్ల హర్డిల్స్‌తో పాటు 200 మీటర్ల విభాగంలోనూ ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ఈవెంట్‌లో నందిని కె. కూడా 13.24 సెకన్ల టైమింగ్‌తో ఆసియా క్రీడలకు అర్హత సాధించడం విశేషం. ఈ ఛాంపియన్‌షిప్‌లో మురళీ శ్రీశంకర్, జెస్విన్ ఆల్డ్రిన్ వంటి ప్రముఖ అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారు.