హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్

High Court expresses serious dissatisfaction with HYDRA Commissioner over violation of orders
  • కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి
  • భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు
  • గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
  • చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ
  • తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భూ వివాదాలకు సంబంధించిన కేసుల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పదేపదే ధిక్కరించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివాదాస్పద ఆస్తుల వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా వివాదాస్పద స్థలాల్లో సైన్ బోర్డుల తొలగింపు, యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించకపోవడం వంటి అంశాలను కోర్టు ప్రస్తావించింది. కమిషనర్ అనుసరిస్తున్న వైఖరి, ప్రక్రియాపరమైన లోపాలపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరణ ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణకు గైర్హాజరవుతూ మినహాయింపు కోరుతూ కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, 20 రోజుల వరకు బోర్డును ఎందుకు తొలగించలేదో, విచారణకు ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం హైడ్రా తరపు న్యాయవాది అఫిడవిట్ సమర్పించడంతో వ్యక్తిగత హాజరు నుంచి కమిషనర్‌కు మినహాయింపునిచ్చింది. 

అయితే, దాఖలు చేసిన అఫిడవిట్ అసంపూర్తిగా, నిర్లక్ష్యంగా ఉందని అభిప్రాయపడిన కోర్టు.. మరింత సమగ్రమైన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం రంగనాథ్ వృత్తిపరమైన కెరీర్‌పై ప్రభావం చూపుతుందని, ఈ విషయాన్ని ఆయనకు స్పష్టం చేయాలని న్యాయవాదికి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.                                
Go Back to Shorts
AV Ranganath
HYDRA Commissioner
Telangana High Court
Contempt of Court
Hyderabad Land Disputes
HYDRA Ranganath Court Case

More Telugu News