పెళ్లిపీటల నుంచి వధువు జంప్.. ఆమె చెల్లితో పెళ్లికి యత్నం.. ఆపై ఊహించని ట్విస్ట్!

Bride flees from wedding mandap attempts to marry sister leads to unexpected twist
  • నగలతోపాటు వధువు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యుల షాక్
  • అవమానం తట్టుకోలేక చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయం 
  • తాను వేరొకరిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లికి తిరస్కరణ
  • మండపంలో రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బిథ్రి చైన్‌పూర్ పరిధిలోని నరియావల్ గ్రామంలో జరిగిన ఒక నిఖా వేడుక తీవ్ర ఉద్రిక్తతలకు, హింసాత్మక ఘర్షణకు దారితీసింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు నిఖాకు కొన్ని నిమిషాల ముందే నగలు తీసుకుని ప్రియుడితో పరారవడంతో ఈ హైడ్రామా మొదలైంది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమండపానికి చేరుకున్న తరుణంలో వధువు అదృశ్యమైన విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యారు. పెళ్లి రద్దుకాకుండా ఉండేందుకు, ఇరువైపుల పెద్దలు పంచాయితీ పెట్టి వధువు చిన్న చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు.

అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వరుడి వైపు వారు దీనిని తీవ్ర అవమానంగా భావించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ గొడవ కాస్తా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇరుపక్షాలు కర్రలు, ఇటుకలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో వధువు తరపు బంధువులతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బిథ్రి చైన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చివరికి, పెళ్లి పూర్తిగా రద్దు కావడంతో వరుడి తరపు వారు వధువు లేకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. 
Go Back to Shorts
Bareilly Bride
Uttar Pradesh Wedding Brawl
Bride Runs Away With Lover
Bithri Chainpur Police
Nariawal Village Wedding Incident
Sister Refuses Forced Marriage

More Telugu News