భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్‌.. కేంద్రం స్పందన ఇదే..!

భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్‌.. కేంద్రం స్పందన ఇదే..!

India Reacts To Trumps New Tariffs
  • వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారుచేయించారని అమెరికా ఆరోపణ
  • అందుకుగానూ 12.5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన
  • ఇది ఇంకా ఖరారు కాలేదని కేంద్రం ప్రభుత్వం వివరణ
  • వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడి
భారత వస్తువులపై అమెరికా మరోసారి అదనపు సుంకాలు విధించనుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంపై అగ్రరాజ్యంతో నిరంతరం చర్చిస్తున్నామని, ఈ పన్నుల ప్రతిపాదన ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేసింది. కార్మికులతో వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారు చేయించారంటూ భారత్‌తో సహా 60 దేశాలపై సెక్షన్ 301 కింద అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ పన్నుల ప్రతిపాదన ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ దశలోనే ఉందని పేర్కొంది. సంబంధిత వర్గాలు 2026 జూన్ 22లోపు తమ విజ్ఞప్తులను సమర్పించవచ్చని, జులై 7 తర్వాతే అమెరికా తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

ఇప్పటికే సెక్షన్ 232 కింద ఉన్న కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త పన్నుల నుంచి మినహాయింపు లభించింది. అలాగే టెక్స్‌టైల్ రంగానికి అమెరికా ప్రత్యేక వెసులుబాటును ప్రతిపాదించింది. దీని ప్రకారం నిర్దేశిత పరిమాణంలోని దుస్తుల దిగుమతులపై తక్కువ పన్ను రేట్లు విధించే అవకాశం ఉంది. పరస్పర వాణిజ్య ఒప్పందాలు అంగీకరించే దేశాలకు ఈ పన్ను 10 శాతంగా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ వెల్లడించింది.
Advertisement
India
USA
Trump
Modi
Tariffs
INDIA US Relations
US Additional Tariffs

More Telugu News