కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu Fires at YSRCP Conspiracy in Tuni Meeting
  • తుని నియోజకవర్గంలో పేదల సేవలో సభ 
  • వైసీపీని ఏకిపారేసిన సీఎం చంద్రబాబు
  • సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు
  • నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తేనని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,887 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడి
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే, ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన కడుపు మంటతోనే రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో సోమవారం జరిగిన 'పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలను ఏకిపారేశారు.

సుపరిపాలన చూసి ఓర్వలేకే కుతంత్రాలు

గత ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే, వైసీపీ ఇంకా విధ్వంసాన్ని కొనసాగించే ప్రయత్నంలోనే ఉందని చంద్రబాబు విమర్శించారు. "సుపరిపాలన చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోంది. వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపి గుండెపోటు డ్రామా ఆడారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి కోడికత్తి, గులకరాయి నాటకాలతో ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా వారి బుద్ధి మారలేదు" అని మండిపడ్డారు.

ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ కుట్రలను ఆయన ఎండగట్టారు. "పరామర్శకు వెళుతూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపి పొదల్లో పడేశారు. ఇటీవల కడపకు చెందిన ఓ పాస్టర్‌ను పంపి మాపై హత్యాయత్నం డ్రామా ఆడారు. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి ప్రమాదంలో చనిపోతే, దాన్ని కూడా మాకు అంటగట్టాలని చూశారు. సీసీకెమెరాలతో ఈ కుట్రలు బట్టబయలత్తూయ్యాయి. సాక్షాత్తు తిరుమల కొండపై సాక్షి మీడియా ప్రతినిధులే మద్యం బాటిళ్లు పడేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నించారు. కడపలో పెద్ద దస్తగిరిని ఆస్తుల వివాదంలో వైసీపీ వారే హత్య చేసి, టీడీపీపై నెపం మోపజూశారు. చివరికి నంద్యాలలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది కూడా వైసీపీ కార్యకర్తే. అందుకే ఆ వార్తను సాక్షి పత్రికలో రాయలేదు. కాకినాడలో దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి వైసీపీ సన్మానాలు చేసింది. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న వారి ఆటలు సాగనీయం" అని చంద్రబాబు హెచ్చరించారు.

విధ్వంసం నుంచి ప్రజలకు విముక్తి

జూన్ 4వ తేదీ రాష్ట్ర చరిత్రలో విధ్వంసం నుంచి ప్రజలకు విముక్తి కలిగిన రోజుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. "గత పాలనలో ప్రజలు బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదల కోసం పనిచేస్తున్నాం. రూ.10 లక్షల కోట్ల అప్పులున్నా, పెన్షన్లను రూ.1,000 పెంచి రూ.4,000 చేశాం. దివ్యాంగులకు రూ.6,000, ఆరోగ్య పెన్షన్లను రూ.10,000, రూ.15,000కు పెంచాం. 2024 జూలై నుంచి ఇప్పటివరకు రూ.65,887 కోట్లు ఎన్టీఆర్ భరోసా కింద అందించాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు," అని చంద్రబాబు వివరించారు. బటన్ నొక్కితే పైశాచిక ఆనందం తప్ప, ప్రజల కష్టాలు తెలియవని, అందుకే ప్రతీ నెలా ఒకటో తేదీన నేరుగా ప్రజల వద్దకే వచ్చి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.

సంక్షేమంతో పాటు ఉపాధి, అభివృద్ధి

సంక్షేమంతో పాటు అభివృద్ధి, సుపరిపాలన అందిస్తూనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. "23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. కాకినాడ సమీపంలో రూ.80 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ, అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయి. పీఎం సేతు కింద ఏటా 25 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తాం. కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించాం. ఎన్నో ఏళ్ల కల అయిన విశాఖ రైల్వే జోన్ కూడా సాకారమైంది" అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పోలవరం ఎడమ కాలువను జూలైలోగా పూర్తి చేసి విశాఖకు నీరందిస్తామని హామీ ఇచ్చారు.

ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "పాఠశాలల్లో సంస్కరణలు తెచ్చి నాణ్యమైన విద్యను అందిస్తాం. ఖరీదైన వైద్యం కోసం అప్పులపాలు కాకుండా 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' తెస్తున్నాం. 'సంజీవని' పేరుతో ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసి, ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం," అని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ ద్వారా రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని, శ్రీకాకుళం, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లను సమానంగా అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు.

దివ్యాంగుడిని ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు

సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకే 'పీ4' (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా నిలుస్తున్న 'బంగారు కుటుంబాల'తో ఆయన మాట్లాడారు. అనంతరం, వేదిక వద్దకు వచ్చిన ఓ దివ్యాంగ అభిమానిని ఆప్యాయంగా పలకరించి, అతని భుజంపై చేయి వేసి ఫొటో దిగారు. అతనికి ప్రభుత్వ సహకారం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి. నారాయణ, ఎమ్మెల్యే యనమల దివ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
YSRCP
Tuni
Pension Scheme
NTR Bharosa
Corruption
Politics
AP Government
Jagan Mohan Reddy

More Telugu News