2027 వన్డే వరల్డ్‌కప్‌కు రవిశాస్త్రి డ్రీమ్ టీమ్ ఇదే!
- దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి వేదికలుగా 2027 ప్రపంచకప్
- సీనియర్లు, జూనియర్ల కాంబినేషన్ తో జట్టును ఎంపిక చేసిన రవిశాస్త్రి
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టీమిండియా స్క్వాడ్‌పై ముందస్తు చర్చలు ఊపందుకున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన 15 మంది సభ్యుల డ్రీమ్ టీమ్ ను ప్రకటించారు. సీనియర్ల అనుభవం, యువకుల ఆవేశాన్ని సమతుల్యం చేస్తూ ఈ జట్టును రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వస్తున్నప్పటికీ... 2027 వరల్డ్‌కప్‌లో వీరిద్దరు భారత్‌కు అత్యంత కీలకమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఐసీసీ మెగా టోర్నీల్లో వీరి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇక శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు.
రవిశాస్త్రి ఎంచుకున్న పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలతో పాటు సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కడం విశేషం. సౌతాఫ్రికాలోని సీమ్, బౌన్స్ పిచ్‌లపై ఈ అనుభవజ్ఞులైన పేసర్లు ప్రత్యర్థులను దెబ్బతీయగలరని రవిశాస్త్రి పేర్కొన్నారు. అయితే, మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి యువ పేసర్లను ప్రోత్సహిస్తున్నారు.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.