రోహిత్ మాటలు అప్పట్లో నమ్మలేదు.. ప్రపంచకప్‌లో అదే నన్ను మార్చింది: సంజూ శాంసన్

Sanju Samson reveals how Rohit Sharma encouraged him during T20 World Cup
  • టీ20 ప్రపంచకప్‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సంజూ
  • ఆరంభ మ్యాచుల్లో ఎంపిక చేయకపోవడంతో నిరాశకు గురైనట్లు వెల్లడి
  • రోహిత్‌ ధైర్యం చెప్పినా నమ్మలేకపోయానన్న శాంసన్‌
  • క్రికెట్ ఎందుకు ఆడుతున్నానో తనను తాను ప్రశ్నించుకున్నట్లు వెల్లడి
  • అదే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్న సంజూ
  • న్యూజిలాండ్ సిరీస్ పెద్ద గుణపాఠం నేర్పిందని వెల్లడి
టీ20 ప్రపంచకప్‌-2026లో తొలుత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడంతో తన ప్రపంచకప్ అవకాశాలు ముగిసిపోయాయని భావించినట్లు చెప్పాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ ధైర్యం చెప్పినా తాను ఆ మాటలను నమ్మలేకపోయానని జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ప్రపంచకప్ ప్రారంభమైన తొలి నాలుగు, ఐదు రోజులు ఆ నిరాశ నుంచి బయటపడలేకపోయానని సంజూ చెప్పాడు. ఆ తర్వాత తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని.. అసలు తాను క్రికెట్ ఎందుకు ఆడుతున్నానో తనను తాను ప్రశ్నించుకున్నానని వివరించాడు. అదే తనలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, మానసికంగా బలంగా మారేందుకు దోహదపడిందని పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు మరింత మెరుగ్గా సిద్ధమయ్యానని సంజూ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో ప్రతి షాట్ సహజంగానే వచ్చిందని, అది తన కెరీర్‌లో ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుందని అన్నాడు. వికెట్లు పడుతుండటంతో సాధారణ ఆటతీరును మార్చుకుని పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశానని వివరించాడు.

ఇక న్యూజిలాండ్ సిరీస్ తనకు పెద్ద గుణపాఠం నేర్పిందని సంజూ చెప్పాడు. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం కంటే మానసికంగా ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమని తన భార్య చెప్పిన మాటలు అప్పుడే అర్థమయ్యాయని పేర్కొన్నాడు. తాను సాధించిన విజయాల్లో దేవుడి ఆశీర్వాదమే ఎక్కువని, ఆ ప్రపంచకప్ ఇన్నింగ్స్ జీవితాంతం గుర్తుండిపోతుందని సంజూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.
Advertisement
Sanju Samson
Rohit Sharma
T20 World Cup
Indian Cricket Team
Sanju Samson Interview
Cricket News

More Telugu News