కోరుట్లలో ఆర్టీసీ బస్సు చోరీ.. సినిమాను తలపించిన ఛేజింగ్!

RTC bus theft in Korutla movie like chasing ensues
  • కోరుట్ల బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఆగంతకుడు
  • 18 కిలోమీటర్ల పాటు ఛేజ్ చేసి వెంబడించిన పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది
  • దారిలో మూడు ద్విచక్రవాహనాలను, పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన నిందితుడు
  • మెట్‌పల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి బస్సును అడ్డుకున్న పోలీసులు
  • చెట్టును ఢీకొట్టి ఆగడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న వైనం
జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ ఆగంతకుడు దొంగిలించి పోలీసులను పరుగులు పెట్టించాడు. సుమారు 18 కిలోమీటర్ల మేర సినిమాను తలపించేలా సాగిన ఛేజింగ్ అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు వేగంగా నడిపాడు. దీనిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కలిసి బస్సును వెంబడించారు. మార్గమధ్యంలో కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతాల్లో మూడు ద్విచక్ర వాహనాలను సదరు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో బైక్‌లపై వెళ్తున్న వారికి గాయాలయ్యాయి.

అంతటితో ఆగకుండా, తనను వెంబడిస్తున్న పోలీసు వాహనాన్ని కూడా నిందితుడు ఢీకొట్టాడు. మెట్‌పల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు మెట్‌పల్లి మండల పరిధిలోని గండి హనుమాన్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనాలను అడ్డంగా ఉంచి బస్సును నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. వెంటనే బస్సులో నుంచి కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.                                
Advertisement
TSRTC Bus
Korutla Bus Theft
Jagtial Police Chase
Telangana RTC News
Metpally Incident
Stolen Bus Chasing

More Telugu News