మీకు కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? కెఫీన్ అడిక్షన్‌కు గురయ్యారేమో ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి!

Caffeine Addiction Signs Are You Addicted to Coffee or Tea
  • కాఫీ, టీ అతిగా తాగడం వల్ల కెఫీన్ అడిక్షన్ ముప్పు
  • సమయానికి కెఫీన్ అందకపోతే తలనొప్పి, నీరసం
  • నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రధాన లక్షణాలు
  • ఒక్కసారిగా కాకుండా క్రమంగా కాఫీలు తగ్గించడం ఉత్తమం
  • గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి
ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగనిదే చాలామందికి రోజు గడవదు. అలసటను తగ్గించుకోవడానికి, ఎనర్జీ కోసం తీసుకునే ఈ పానీయాలు నెమ్మదిగా మనల్ని వాటికి బానిసలుగా (కెఫీన్ డిపెండెన్స్) మార్చేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజంలో ఇది చాలా సాధారణ అలవాటుగా మారిపోవడం వల్ల, చాలామంది తాము ‘కెఫీన్ యూజ్ డిజార్డర్’ అనే మానసిక, శారీరక రుగ్మతకు లోనైనట్లు గుర్తించలేకపోతున్నారు.

ప్రధాన సంకేతాలు

తీవ్రమైన తలనొప్పి
రోజూ తాగే సమయానికి కాఫీ లేదా టీ తాగకపోతే తలనొప్పి, నీరసం, చిరాకు, మెదడు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరం, నరాల వ్యవస్థ ఆ కెఫీన్‌కు అలవాటు పడిపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ఇది ఒక రకమైన విత్‌డ్రాయల్ సింప్టమ్ అని వైద్యులు చెబుతున్నారు.

తీవ్రమైన ఆందోళన
మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట గాఢ నిద్ర కరవవుతుంది. నిద్ర సరిగా లేకపోతే మరుసటి రోజు అలసటగా అనిపించి మళ్లీ ఎక్కువ కాఫీలు తాగే ప్రమాదకరమైన చక్రంలో ఇరుక్కుపోతారు. దీనివల్ల నరాల వ్యవస్థ అతిగా ఉత్తేజితమై గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, అనవసరమైన ఆందోళన పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కడుపులో మంట
కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీనివల్ల విపరీతమైన ఎసిడిటీ, కడుపులో అసౌకర్యం, వికారం, మోషన్స్ వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్లలో ఉండే కెఫీన్, షుగర్ కంటెంట్ వల్ల ఈ ముప్పు మరింత ఎక్కువవుతుంది.

బ్రెయిన్‌ను ఎలా బురిడీ కొట్టిస్తుంది?
మన మెదడులో అలసటను, నిద్రను కలిగించే ‘అడెనోసిన్’ అనే రసాయనాన్ని కెఫీన్ తాత్కాలికంగా అడ్డుకుంటుంది. దీనివల్ల మెదడుకు అలసట తెలియక తాత్కాలికంగా అలర్ట్‌నెస్, ఎనర్జీ పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో బాడీ దీనికి అలవాటు పడిపోవడం వల్ల పాత కిక్ రావడానికి రోజురోజుకూ ఎక్కువ కప్పుల కాఫీలు తాగాల్సి వస్తుంది.

బయటపడండిలా..
  • ఒక్కసారిగా మానేయకుండా రోజువారీ కప్పుల సంఖ్యను క్రమంగా తగ్గించాలి.
  • సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కెఫీన్ ఉత్పత్తులను పూర్తిగా దూరం పెట్టాలి.
  • కాఫీకి బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీ లేదా ఎక్కువ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
Go Back to Shorts
Caffeine Addiction
Coffee
Tea
Caffeine Dependence
Headache
Anxiety
Acidity
Sleep Problems
Energy Drinks
Withdrawal Symptoms

More Telugu News