ఎనర్జీ డ్రింక్ తాగే వారికి షాకిచ్చే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళ తాను తాగుతున్న ఓ ఎనర్జీ డ్రింక్ క్యాన్‌లో చనిపోయిన ఎలుకను కనుగొంది. సగం డ్రింక్ తాగిన తర్వాత ఈ విషయం తెలియడంతో ఆమె తీవ్ర  దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే, ఓ మహిళ ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేసి తాగడం ప్రారంభించింది. సగం తాగిన తర్వాత, డ్రింక్ సిప్ చేస్తుండగా ఆమె పెదవులకు ఏదో గట్టిగా తగిలినట్లు అనిపించింది. మొదట అది ఐస్ ముక్క లేదా సోడా బబుల్ అని భావించింది. అనుమానం వచ్చి క్యాన్‌లోకి చూడగా, లోపల ఓ ఎలుక పూర్తిగా చనిపోయి తేలుతూ కనిపించింది. ఈ షాకింగ్ అనుభవాన్ని ఆమె వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇకపై క్యాన్ల నుంచి నేరుగా తాగేది లేదు" అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. "డ్రింక్ సిప్ చేస్తుంటే అదే మనల్ని కాటేస్తుందని ఊహించుకోండి" అంటూ ఓ యూజర్ చేసిన కామెంట్ వైరల్ అయింది. "ఎక్స్‌ట్రా ప్రోటీన్," "కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఫ్లేవర్" అంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు.

అయితే, ఈ ఘటనపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పాపులారిటీ (క్లౌట్) కోసం సృష్టించిన నకిలీ వీడియో అని ఆరోపిస్తున్నారు. "ఎలుక అప్పుడే చనిపోయినట్లు తాజాగా ఉంది. ఫ్యాక్టరీలో ప్యాకింగ్ సమయంలో ఇలా జరగడం అసాధ్యం" అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా, ఈ సంఘటన క్యాన్డ్ డ్రింక్స్ భద్రతపై పెద్ద చర్చనైతే రేకెత్తించింది. ఇది నిజమైన సంఘటనా లేక కావాలని సృష్టించిందా అనే దానిపై సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతున్నాయి.