మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరు అధికారికంగా మారింది. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రపంచవ్యాప్త పరిశోధన, సంప్రదింపుల తర్వాత దీనికి 'పాలియెండోక్రైన్ మెటాబాలిక్ ఓవరీ సిండ్రోమ్' (PMOS)గా నామకరణం చేశారు. ఈ మార్పు కేవలం పేరుకే పరిమితం కాదని, మహిళల ఆరోగ్య సంరక్షణలో ఒక కీలక ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకీ పేరు మార్పు?

పీసీఓఎస్ అనే పాత పేరు ఈ సమస్యను కేవలం అండాశయాల్లోని నీటి బుడగలకు (సిస్టులు) మాత్రమే పరిమితం చేస్తోందని, ఇది తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు భావించారు. ఈ పేరు వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరగడం, సరైన చికిత్స అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని మొనాష్ యూనివర్సిటీ నేతృత్వంలోని అధ్యయనంలో తేలింది. వాస్తవానికి ఇది కేవలం అండాశయాలకు సంబంధించిన సమస్య కాదని, పూర్తిస్థాయి హార్మోనల్, జీవక్రియ (మెటాబాలిక్) రుగ్మత అని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మంది మహిళల్లో ఒకరిని ప్రభావితం చేసే ఈ సమస్య, హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. ఇది బరువు, జీవక్రియ, మానసిక ఆరోగ్యం, చర్మ సమస్యలు, పునరుత్పాదక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త పేరు 'పీఎంఓఎస్' ఈ సమస్య యొక్క సంక్లిష్ట స్వభావాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఆరు ఖండాలకు చెందిన నిపుణులు, రోగులతో కలిసి 14 సంవత్సరాల పాటు చర్చించి ఈ మార్పుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. రాబోయే 3 సంవత్సరాల్లో కొత్త పేరును పూర్తిగా వాడుకలోకి తీసుకురానున్నారు. 2028 నాటికి అంతర్జాతీయ మార్గదర్శకాల్లో పీఎంఓఎస్ పేరును అధికారికంగా చేర్చనున్నారు. ఈ మార్పు వ్యాధిపై సరైన అవగాహన పెంచి, రోగనిర్ధారణ, చికిత్సా విధానాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు.