ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి రాకతో వేడుక ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.

‘లవ్ స్టోరీ’, ‘కుబేర’ వంటి చిత్రాల నిర్మాత సునీల్ నారంగ్ ఇంట జరిగిన ఈ శుభకార్యానికి టాలీవుడ్ తారలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, మాస్ మహారాజా రవితేజ, రానా దగ్గుబాటి వంటి అగ్ర హీరోలు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో నాగచైతన్య-శోభిత ధూళిపాళ, సమంత-రాజ్ నిడిమోరు వంటి జంటలు కూడా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. వీరితో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

టాలీవుడ్‌లోని ప్రముఖులంతా ఒకేచోట చేరడంతో రిసెప్షన్ వేదిక తారల వెలుగులతో నిండిపోయింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.