ఏజెంట్లను బయటకు పంపించి.. బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు!
- బెంగాల్‌లోని కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఘటన
- పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపణ
- బూత్ నెంబర్ 24 వద్ద తనపై, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందన్న అభ్యర్థి
మా ఏజెంట్లను బయటకు పంపించారు, నాపై దాడి చేశారు: సుబేందు సర్కార్
కుమార్ గంజ్‌లోని ఒక పోలింగ్ బూత్ వద్ద తనపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని సుబేందు సర్కార్ ఆరోపించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోని తమ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూత్ నెంబర్ 24 వద్ద తాను పరిశీలించడానికి వెళ్లిన సమయంలో టీఎంసీ కార్యకర్తలు తనపై, తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని తెలిపారు. ఘటన జరిగినప్పుడు పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు లేవని చెప్పారు.
ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని, తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పది పోలింగ్ కేంద్రాల్లో తమ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, వారిని తిరిగి లోపలకు పంపించే ప్రయత్నం చేశానని అన్నారు. బూత్ నెంబర్ 24లోనూ తమ ఏజెంటును బయటకు పంపించడంతో తాను అడిగానని, దీంతో టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అన్నారు. పోలింగ్ సమయంలో అధికార పార్టీ భయానక వాతావరణం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.