'డెలులు', 'క్లాక్ ఇట్'.. పార్లమెంటుకు పాకిన జెన్ జీ స్లాంగ్ పదాలు

Gen-Z Slang Words Delulu and Clock It Reach Indian Parliament
  • 'బొద్దింక జనతా పార్టీ' పేరుతో యువత సరికొత్త నిరసన
  • పార్లమెంటు చర్చల్లోకి జెన్ జీ స్లాంగ్ పదాలు
  • జెన్ జీ పదాల ఉపయోగాన్ని ప్రశ్నించిన సుప్రియా సూలే
దేశంలో యువత చేపట్టిన సరికొత్త నిరసన ఉద్యమం ఇప్పుడు వీధుల నుంచి పార్లమెంటు చర్చల వరకు చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమంలో యువత ఉపయోగిస్తున్న 'డెలులు', 'క్లాక్ ఇట్' వంటి ఆధునిక జెన్ జీ పదజాలం ఇప్పుడు చట్టసభల్లోనూ వినిపిస్తూ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలి వరకు ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌లు, గ్రూప్ చాట్‌లు, మీమ్ పేజీలకే పరిమితమైన ఈ పదాలు, తాజాగా లోక్‌సభలో ప్రతిధ్వనించాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ, ప్రతిపక్షం "ఎంఐఏ" (మిస్సింగ్ ఇన్ యాక్షన్)గా ఉందని, "ఎఫ్ఓఎంఓ" (ఏదైనా కోల్పోతామనే భయం)తో వణికిపోతోందని విమర్శించారు. చివరకు వాస్తవికతకు దూరంగా భ్రమలో బతుకుతున్నారనే అర్థం వచ్చేలా 'డెలులు' అనే పదాన్ని ప్రయోగిస్తూ ప్రతిపక్షంపై ఎద్దేవా చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ సింగ్ హూడా సైతం ప్రభుత్వాన్ని విమర్శించడానికి నిరసనల సమయంలో ప్రాచుర్యం పొందిన ఒక అర్థరహిత జెన్ జీ నినాదాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించి సభలో నవ్వులు పూయించారు.

బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకురావడాన్ని ప్రశంసిస్తూ 'క్లాక్ ఇట్' అనే పదాన్ని వాడారు. ఎంపీ తేజస్వీ సూర్య సైతం ఇదే బాటలో పయనిస్తూ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమర్థవంతమైన బిల్లులు తీసుకురాలేకపోయిందని, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మద్దతు ఇవ్వకుండా విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ 'డెలులు' అని పదాన్ని ఉపయోగించారు. ఈ పరిణామాలపై ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ, మనమంతా జెన్ జీ భాషలోకి ఎందుకు వెళుతున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గత మే నెలలో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశించి 'బొద్దింకలు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ వివాదం మొదలైంది. అయితే, తాను కేవలం నకిలీ డిగ్రీలు ఉన్నవారిని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్య చేశానని ఆయన తదుపరి వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అభిజీత్ దీప్కే (30), అధికార బీజేపీకి వ్యంగ్యాస్త్రంగా ఆన్‌లైన్‌లో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు.

సోషల్ మీడియాలో అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది మద్దతు సంపాదించుకున్న ఈ ఉద్యమం, క్రమంగా ప్రత్యక్ష నిరసనలకు దారితీసింది. 
Advertisement
Gen-Z Slang
Indian Parliament
Delulu and Clock It
Cockroach Janata Party
NEET UG Paper Leak
Lok Sabha Debates

More Telugu News