అఖిలప్రియకు అధిష్ఠానం సీరియస్ వార్నింగ్.. భర్త జోక్యంపై చంద్రబాబు ఆగ్రహం!

Bhuma Akhila Priya receives serious warning from TDP high command over husband interference
  • ఆళ్లగడ్డ వివాదాలపై టీడీపీ హైకమాండ్ ఫోకస్
  • ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ జోక్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
  • అహోబిలం తలనీలాల టెండర్ వ్యవహారంలో జోక్యంపై ఆగ్రహం
  • క్రమశిక్షణ మీరితే చర్యలు తప్పవని తేల్చిచెప్పిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
  • చిన్న విషయాలను సోషల్ మీడియాలో పెద్దవి చేస్తున్నారని అఖిలప్రియ ఆవేదన
ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాలు, అహోబిలం దేవాలయ టెండర్ల వివాదంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి, ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గ వ్యవహారాల్లో ఆమె భర్త భార్గవ్ రామ్ జోక్యం చేసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా స్పష్టం చేసినట్లు తెలిసింది.

అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో అఖిలప్రియ జోక్యం చేసుకోవడం, ఆమె భర్త కారణంగా స్థానికంగా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులతో విభేదాలు తలెత్తడం వంటి అంశాలపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం, ఎమ్మెల్యేగా కేవలం అఖిలప్రియ మాత్రమే బాధ్యతలు చూడాలని, ఆమె భర్త జోక్యం ఎంతమాత్రం ఉండటానికి వీల్లేదని పల్లా కరాఖండిగా చెప్పారు. పార్టీ క్రమశిక్షణను దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా, దివంగత నేతలైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రాజకీయ స్థాయికి తగినట్లుగా పనిచేయాలని, వారి పేరు నిలబెట్టాలని అఖిలప్రియకు పల్లా సూచించారు. పార్టీ సూచనలు తప్పక పాటిస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటే పార్టీ పూర్తి అండగా ఉంటుందని పల్లా భరోసా ఇచ్చారు.

భేటీ అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్ద సెన్సేషన్‌గా మారుస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అనవసరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని వివాదాలు, సమస్యలపై పార్టీ అధ్యక్షుడికి పూర్తి స్పష్టత ఇచ్చానని, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి అయోమయం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన్ను కలిశానని వివరించారు. మొత్తం మీద, ఆళ్లగడ్డలో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ చర్యనూ సహించేది లేదని టీడీపీ అధిష్ఠానం అఖిలప్రియకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది.
Advertisement
Bhuma Akhila Priya
Chandrababu Naidu
Allagadda TDP Politics
Ahobilam Temple Tenders
Palla Srinivasa Rao
Andhra Pradesh Politics

More Telugu News