ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Trainee IPS Uday Krishna Reddy remanded for 14 days and shifted to Chanchalguda Jail
  • ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసు
  • ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డికి ఆగస్టు 11 వరకు రిమాండ్
  • చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
  • తమది ఇద్దరి అంగీకారంతో కూడిన సంబంధమని నిందితుడి వాదన
  • ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్
ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మంగళవారం అరెస్టయిన ఆయన్ను పోలీసులు బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఉదయ్‌ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తనతో పాటు శిక్షణ పొందుతున్న 30 ఏళ్ల మహిళా అధికారిణిని లైంగికంగా వేధించాడని ఉదయ్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పదే పదే లైంగిక వేధింపులకు గురిచేయడం, వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడం, వెంటపడడడం (స్టాకింగ్), అక్రమంగా నిర్బంధించడం, శారీరకంగా దాడి చేసి బెదిరింపులకు పాల్పడటం వంటివి ఫిర్యాదులో ఉన్నాయి. అంతేకాకుండా, రహస్యంగా ప్రైవేట్ వీడియో తీసి, దానిని ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈనెల 18న బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద లైంగిక వేధింపులు, మహిళ పట్ల నేరపూరిత బలప్రయోగం, గోప్యతకు భంగం కలిగించడం, అశ్లీల సమాచారాన్ని ప్రసారం చేయడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు ఉదయ్‌ను అశోక్ నగర్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం.

మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బాధితురాలితో తనకు ఏడాదిగా (2025 జూన్ 2025) సంబంధం ఉందని, ఆమెకు వివాహం జరిగిన తర్వాత కూడా అది కొనసాగిందని ఆయన వాదిస్తున్నారు. తమ సంబంధం ఇద్దరి అంగీకారంతోనే జరిగిందని నిరూపించడానికి తన వద్ద ఫొటోలు, వీడియోల రూపంలో ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈనెల 21న మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఇది ఆత్మహత్యాయత్నమని ప్రచారం జరిగినా, సానుభూతి కోసమే ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆయన అదృశ్యమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే, తనపై ఆరోపణలు రావడంతో అనారోగ్యం పాలైన నాయనమ్మను చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉళ్లపాలెం వెళ్లానని, తాను పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తిరిగి వస్తుండగా మంగళవారం నాడు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో బాధితురాలికి ఇంకా నోటీసులు జారీ చేయలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టుకు తెలపడంతో, విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Advertisement
Uday Krishna Reddy
Trainee IPS officer arrest
Sexual harassment case
Chanchalguda Central Jail
Upparpalli Court Hyderabad
Sardar Vallabhbhai Patel National Police Academy

More Telugu News