కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?: రేవంత్, కేసీఆర్ లకు రాంచందర్ రావు సవాల్
- తెలంగాణకు గత పదేళ్లలో కేంద్రం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్న రాంచందర్ రావు
- రేవంత్, కేసీఆర్ ఎక్కడకు వచ్చినా చర్చకు తాను సిద్ధమని వ్యాఖ్య
- హరీశ్ రావు తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని స్పష్టీకరణ
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అందించిన నిధుల విషయంలో తాము చర్చకు ఎప్పుడూ సిద్ధమేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందని, కేవలం గత రెండేళ్లలోనే రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించిందని గణాంకాలతో వివరించారు.
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వచ్చినా తాను చర్చకు సిద్ధమని, వారు ఎప్పుడు సిద్ధమో చెబితే తాను వస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఢిల్లీకి వచ్చింది కేవలం కాళేశ్వరం కేసులో చట్టపరమైన సలహాల కోసమేనని, ఆయన తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద సీబీఐ విచారణ కోరాల్సింది పోయి, కేవలం నాణ్యత లేని బ్యారేజీల మీద మాత్రమే విచారణ కోరడం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎండగట్టారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి, కేసీఆర్ కేవలం బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అక్రమ మీటర్లు వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.