రేవంత్ రెడ్డి ‘యూ-టర్న్’ తీసుకున్నారు.. కాళేశ్వరంపై బండి సంజయ్ నిప్పులు
- ఈ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని గతంలో రేవంత్ అన్నారన్న సంజయ్
- లక్ష కోట్ల అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టారన్న కేంద్ర మంత్రి
- ఇప్పడు కేవలం రూ. 9 వేల కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐకి లేఖ రాశారని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని ఆరోపించారు. గతంలో ఈ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని, గోదావరిలో కొట్టుకుపోయిందని విమర్శించిన రేవంత్... ఇప్పుడు దానిపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో గగ్గోలు పెట్టి, ఇప్పుడు సీబీఐకి కేవలం 9 వేల కోట్ల స్కామ్ జరిగిందని అర్థం లేని లేఖ రాయడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఏ ఆధారాలను బట్టి సీబీఐ విచారణ చేపట్టాలో సీఎం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిపై అయినా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకుందా? అని బండి సంజయ్ నిలదీశారు. ఒక్కో మోటారుకు వందల కోట్లు ఖర్చు చేసి విదేశాల నుంచి తెచ్చారని, ఈ అవినీతి అంతా బయటకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో కేసీఆర్‌కు ఏటీఎంలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా అలాగే మారిందని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గతంలో పొత్తులు పెట్టుకున్న చరిత్రను గుర్తు చేస్తూ... బీజేపీపై తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలకు తీరని అన్యాయం చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేవలం సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలకు పదవులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేస్తోంది రేవంత్, తమిళనాడు సీఎం స్టాలిన్ అని దుయ్యబట్టారు. ప్రస్తుత సీఎం, మాజీ సీఎంల భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.