స్వీట్లు తిన్న 30 నిమిషాల్లో.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Sugar Consumption Effects on Body in 30 Minutes
  • చక్కెర తిన్న 30 నిమిషాల్లోనే శరీరంలో కీలక మార్పులు
  • అధిక చక్కెర వాడకం కాలేయం, గుండె ఆరోగ్యానికి చేటు
  • ఘన పదార్థాల కన్నా కూల్ డ్రింక్స్‌లోని చక్కెర మరింత ప్రమాదకరం
  • శీతల పానీయాలతో టైప్-2 డయాబెటిస్ ముప్పు 20 శాతం అధికం
  • రోజుకు 25 గ్రాములకు మించి చక్కెర వాడొద్దని డ‌బ్ల్యూహెచ్ఓ సూచన
మనం ఇష్టంగా తినే స్వీట్లు, చక్కెర పదార్థాలు నోటికి రుచిని పంచినా, అవి తిన్న కేవలం అరగంటలోనే మన శరీరంలో పెను మార్పులకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర శరీరంలోకి చేరగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరుగుతాయి. దీనిని అదుపులోకి తెచ్చేందుకు ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇదే సమయంలో మెదడులో 'డోపమైన్' అనే హార్మోన్ విడుదలై తాత్కాలికంగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

అయితే ఈ ఉత్సాహం కొద్దిసేపే ఉంటుంది. అరగంట తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులు ఒక్కసారిగా పడిపోవడంతో 'షుగర్ క్రాష్'కు గురవుతాం. దీనివల్ల నీరసం, మళ్లీ ఆకలిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం
అధిక చక్కెర వినియోగం కాలేయంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తుంది. అదనపు చక్కెరను కాలేయం కొవ్వుగా మార్చడం వల్ల కాలక్రమేణా 'ఫ్యాటీ లివర్' సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా, రక్తనాళాల్లో వాపు (ఇన్‌ఫ్లమేషన్) ఏర్పడి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. చర్మంపై ముడతలు రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలకు కూడా అధిక చక్కెర వాడకమే కారణమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం మనం తినే ఘన పదార్థాల కన్నా శీతల పానీయాల్లోని 'లిక్విడ్ షుగర్' కేవలం 15 నిమిషాల్లోనే రక్తంలో కలిసిపోతుందని తేలింది. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం అధికంగా ఉంటుందని ప్రముఖ వైద్య పత్రిక 'ల్యాన్సెట్' తన కథనంలో పేర్కొంది. చక్కెరను పూర్తిగా మానేయడం కష్టమైనప్పటికీ, రోజుకు 25 గ్రాములకు మించి తీసుకోకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) సూచిస్తోంది.
Go Back to Shorts
Sugar Consumption
Blood Glucose
Insulin
Dopamine
Sugar Crash
Fatty Liver
Type 2 Diabetes
World Health Organization
Liquid Sugar

More Telugu News