రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై జరిగిన అనుమానాస్పద పేలుడు కలకలం రేపింది. శ్రీగంగానగర్‌ జిల్లాలోని రామ్‌సింగ్‌పూర్‌-అనూప్‌గఢ్‌ రైల్వే మార్గంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు శబ్దం సమీప గ్రామాల వరకు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడుకు కారణమేంటో తెలియకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుకు ఈ ప్రాంతం కొంత దూరంలోనే ఉండడం గమనార్హం.

రామ్‌సింగ్‌పూర్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. అంతకుముందే ఆ మార్గంలో ఓ రైలు వెళ్లింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. రామ్‌సింగ్‌పూర్‌తో పాటు 58 జీబీ సహా చుట్టుపక్కల గ్రామాల్లో పేలుడు శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే రామ్‌సింగ్‌పూర్‌ పోలీసులతో పాటు సమీప పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ హరీశంకర్‌ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులు కూడా అక్కడికి చేరుకుని పట్టాలను తనిఖీ చేశారు. పేలుడు స్వరూపం, కారణం ఇంకా తెలియలేదని ఎస్పీ తెలిపారు.

పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందాన్ని రప్పించారు. సీఐడీ అధికారులు కూడా విచారణలో పాల్గొన్నారు. రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ నవల్‌ కిశోర్‌, జైత్‌సర్‌ నాయబ్‌ తహసీల్దార్‌ అంకిత్‌ గోదారా, అనూప్‌గఢ్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ అశోక్‌ సాగ్వా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పేలుడు కారణంగా రైల్వే ట్రాక్‌ దెబ్బతిందా? అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభావిత మార్గంలో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు లేవని రైల్వే అధికారులు తెలిపారు. భద్రతను పెంచడంతో పాటు పట్టాల తనిఖీలను ముమ్మరం చేశారు. పేలుడు ఎలా జరిగింది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై ఫోరెన్సిక్‌ నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.