రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం!

Ajith Kumar Racing Team Secures Second Place in Belgium Race
  • బెల్జియంలోని స్పే ఫ్రాంకోర్‌చాంప్స్‌ రేసులో అజిత్ కుమార్ టీంకు రెండో స్థానం
  • మిచెలిన్ 12H ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ‘అజిత్ కుమార్ రేసింగ్ బై రెడ్ యాంట్’
  • 992-AM కేటగిరీలో పోడియం ఫినిష్ సాధించిన బృందం
  • ఈ సీజన్‌లో అజిత్ టీంకు ఇది మూడో పోడియం విజయం
ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ సహ యజమానిగా ఉన్న రేసింగ్ టీం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. బెల్జియంలోని ప్రఖ్యాత స్పే ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌లో జరిగిన మిచెలిన్ 12H రేసులో ‘అజిత్ కుమార్ రేసింగ్ బై రెడ్ యాంట్’ టీం రెండో స్థానంలో నిలిచి పోడియంను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మోటార్‌స్పోర్ట్స్ అభిమానులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు.

2025 మిచెలిన్ 24H సిరీస్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ పోటీ జరిగింది. ఏప్రిల్ 19, 20 తేదీల్లో రెండు భాగాలుగా నిర్వహించిన ఈ 12 గంటల ఎండ్యూరెన్స్ రేసులో అజిత్ టీం 992-AM క్లాస్‌లో బరిలోకి దిగింది. అజిత్ కుమార్‌తో పాటు ఫ్రాన్స్‌‌కు చెందిన ఫాబియన్ డ్యూఫియక్స్, బెల్జియంకు చెందిన మాథ్యూ విన్సెంట్ ఆర్ డెట్రీ డ్రైవర్లుగా వ్యవహరించారు. వీరు నడిపిన #901 పోర్షే 911 GT3 కప్ (992) కారు రేసులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

ఈ 2025 సీజన్‌లో అజిత్ రేసింగ్ టీం పోడియం ఫినిష్ సాధించడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇంతకుముందు దుబాయ్‌లో జరిగిన 24H రేసులో, ఇటలీలోని ముగెల్లోలో జరిగిన 12H రేసులోనూ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు బెల్జియంలో రెండో స్థానాన్ని సాధించి తమ నిలకడైన ప్రదర్శనను కొనసాగించింది.

ఈ విజయంపై అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర స్పందిస్తూ, "భారత మోటార్‌స్పోర్ట్స్‌‌కు ఇది గర్వకారణమైన క్షణం. ప్రతిష్టాత్మక స్పే సర్క్యూట్‌లో అజిత్, అతని బృందం అద్భుతమైన P2 పోడియం ఫినిష్ సాధించారు. ప్రపంచ వేదికపై అభిరుచి, పట్టుదలకు ఇది నిదర్శనం" అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
 
Go Back to Shorts
Ajith Kumar
Ajith Racing Team
Belguim Race
Michelin 12H Race
Spa Francorchamps
Fabien Dufieux
Matthieu Vincent Ar Detry
Porsche 911 GT3 Cup
Motor sports India

More Telugu News