హిందువులు, యూదుల మధ్య పెరుగుతున్న సంబంధాలు ముస్లింలతో పాటు పాకిస్థాన్‌కు కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయని పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ వ్యాఖ్యానించినట్లు ఇరాన్‌ ఉన్నత భద్రతాధికారి మొహసేన్‌ రెజాయీ వెల్లడించారు. అక్టోబరు 26న టెహ్రాన్‌లో జరిగిన నాలుగు దేశాల భద్రతా సమావేశంలో మునీర్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇరాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీకి రెజాయీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడైంది. ఈ సమావేశంలో మునీర్‌తో పాటు టర్కీ నిఘా విభాగం అధిపతి ఇబ్రహీం కలిన్‌, సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్‌ ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌, ఇరాన్‌ భద్రతాధికారి రెజాయీ పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌ నుంచి తమ దేశాలకు ముప్పు పొంచి ఉందని సమావేశంలో పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్లు రెజాయీ తెలిపారు.

తడుపరిగా ఇజ్రాయెల్‌ టర్కీని, ఆపై సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంటుందని ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ అభిప్రాయపడినట్లు ఆయన చెప్పారు. టర్కీ నిఘా విభాగం అధిపతి కలిన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇజ్రాయెల్‌ నుంచి ముప్పుతో పాటు ముస్లింలకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా హిందువులు, యూదుల మధ్య ఏర్పడుతున్న సంబంధాల గురించి మునీర్‌ మాట్లాడారని రెజాయీ పేర్కొన్నారు.

ఈ వీడియోపై పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ నజమ్‌ సేథీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందించారు. హిందువులు, యూదుల మధ్య కూటమిని మునీర్‌ పెద్ద ముప్పుగా అభివర్ణించారని, ఇది ముస్లింలు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయ సమీకరణంగా ఆయన పేర్కొన్నారని తెలిపారు.

మునీర్‌ గతంలోనూ హిందూ-ముస్లిం విభేదాల ప్రస్తావనతో వ్యాఖ్యలు చేశారు. గతేడాది పహల్గామ్‌ ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. హిందువులు, ముస్లింలు అన్ని విషయాల్లో భిన్నమైన జాతులని పేర్కొన్నారు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు వేరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మునీర్‌ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. పాకిస్థాన్‌లో మైనారిటీలపై వివక్ష, వేధింపులు, హింస కొనసాగుతున్నాయన్న విమర్శలు కూడా ఈ పరిణామంతో మరోసారి తెరపైకి వచ్చాయి.