Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

Chandrababu Naidu Launches Divyangula Shakti Scheme for Disabled on Ugadi
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు నెరవేరుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరుకానున్నారు.

ఈ పథకం ద్వారా 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారితో పాటు ప్రయాణించే సహాయకులకు టిక్కెట్‌లో 50 శాతం రాయితీ లభిస్తుంది. గతంలో పరిమిత వర్గాలకే వర్తించిన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు 4 నుంచి 21 కేటగిరీల దివ్యాంగులకు విస్తరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. మహిళల కోసం ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ బస్సుల్లో కూడా దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

మంగళగిరిలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌, మాధవ్ తదితరులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు. ప్రయాణం ముగిశాక ముఖ్యమంత్రి వారి కోసం ప్రత్యేకంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వారు కూడా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు.

ఇప్పటికే ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 52 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం రూ. 1,826 కోట్లకు పైగా ఖర్చును భరిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ ద్వారా మరో కీలక వర్గానికి భరోసా కల్పిస్తోంది.
Go Back to Shorts
Chandrababu
Divyangula Shakti
AP RTC
Free Bus Travel
Disabilities Scheme
Pawan Kalyan
Nara Lokesh
Andhra Pradesh Government
Yugadi Gift

More Telugu News