ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ-2026 (ఏపీటీఆర్‌టీ-2026) పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి నవంబర్ 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. 

భర్తీ చేయనున్న మొత్తం 2,721 పోస్టుల్లో రెగ్యులర్ విభాగంలో అత్యధికంగా 2,111 ఖాళీలు ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం 350 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ సొసైటీల పాఠశాలల్లో సైతం పెద్ద సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నారు.

వివిధ సొసైటీల పరిధిలో మొత్తం 260 పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ ఖాళీలలో ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల (పీఈటీ) పోస్టులు ఉన్నాయి.

జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీల వివరాలు, పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, సూచించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.