రష్యాలో ఉద్యోగాల పేరుతో సాగుతున్న మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను అప్రమత్తం చేసింది. ఆకర్షణీయమైన జీతాల ఆశచూపి యువతను రష్యాకు తీసుకెళ్లి, అక్కడ వారిని బలవంతంగా సైన్యంలోకి చేరుస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విదేశీ ఉద్యోగాల విషయంలో యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

అనధికారిక ఏజెంట్లు, గుర్తింపు లేని శిక్షణ సంస్థలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువతను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అధిక జీతాలు ఇప్పిస్తామని నమ్మించి రష్యాకు తరలిస్తున్నారని, అక్కడికి వెళ్లిన తర్వాత తప్పుడు కేసులతో భయపెట్టి, బలవంతంగా సైనిక కార్యకలాపాల్లోకి దించుతున్నారని వివరించింది. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు కీలక సూచనలు జారీ చేసింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే ముందు వీసా, ఉద్యోగ ఒప్పంద పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరింది. నియామక ఏజెన్సీ చట్టబద్ధతను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలని స్పష్టం చేసింది. ఏవైనా అనుమానాస్పద ఉద్యోగ ఆఫర్లు లేదా ఏజెంట్ల వివరాలు తెలిస్తే, వెంటనే పోలీసులకు లేదా సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

విదేశీ ఉద్యోగాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని ప్రభుత్వం యువతకు హితవు పలికింది.