Kavya Maran: పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు ఫైర్

Kavya Maran Criticized for Buying Pakistani Cricketer
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ప్రవచనకర్త అనిరుద్ధాచార్య.. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని కావ్యా మారన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' లీగ్ వేలంలో పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై ఆయన మండిపడ్డారు. భారతీయులకు పాకిస్థాన్‌పై ఎందుకంత ప్రేమ? అని ఆయన ప్రశ్నించారు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఫ్రాంచైజీని నడుపుతున్న యాజమాన్యమే 'ది హండ్రెడ్' లీగ్‌లో 'సన్‌రైజర్స్ లీడ్స్' జట్టును కొనుగోలు చేసింది. గురువారం జరిగిన వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) ఈ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో జరుగుతున్న 'సనాతన్ ప్రీమియర్ లీగ్' సందర్భంగా అనిరుద్ధాచార్య శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

"ఆ డబ్బుకు వారు పన్ను కట్టాక, మిగిలిన డబ్బుతో మనపైనే క్షిపణులు ప్రయోగిస్తారు. డబ్బు మన దేశంలోనే ఉండాలి. భారత్ ఆత్మనిర్భర్‌గా మారాలి. పాకిస్థానీ క్రికెటర్ల బదులు మన భారతీయ ఆటగాళ్లను ప్రోత్సహించాలి. మతం చూసి చంపుతున్న పాకిస్థాన్‌పై అంత ప్రేమ ఎందుకు? ఇక్కడ ఆడుతున్న మన పిల్లలను ఎంపిక చేయాలి" అని అనిరుద్ధాచార్య అన్నారు.

కాగా, పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడంపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫ్రాంచైజీని 'దేశ వ్యతిరేకి'గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో, కొన్ని గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా నిలిచిపోయింది. ఈ ఖాతాను ఓపెన్ చేయబోతే "నిబంధనలు ఉల్లంఘించినందున ఖాతాను సస్పెండ్ చేశాం" అని ఎక్స్ నుంచి సందేశం వస్తోంది.

2009 తర్వాత ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్‌లలో ఫ్రాంచైజీలు కొన్న ఐపీఎల్ యజమానులు కూడా పాక్ ఆటగాళ్లను తీసుకోడానికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.


Kavya Maran
Aniruddhacharya
Sunrisers Hyderabad
Abrar Ahmed
The Hundred League
Sunrisers Leeds
Pakistan Cricketer Controversy
IPL Pakistan Players Ban
Sanatan Premier League
Cricket Franchise India

More Telugu News