అవి డీప్‌ఫేక్ వీడియోలు... ఇది వైసీపీ వాళ్ల పనే!: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫైర్
- సోషల్ మీడియాలో తనపై డీప్‌ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి
- టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
- దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
ఈ మేరకు బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం ఇది. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం ముందుకెళతానని స్పష్టం చేశారు.
ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలే ప్రసక్తే లేదని బీఆర్ నాయుడు హెచ్చరించారు. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.
కాగా, వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో ఇవాళ కొన్ని వీడియోలను పంచుకుంది. ఈ వీడియోలపైనే బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు.