ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదు, భారత్ అంటే మోదీ ఒక్కరే కాదు: తెలంగాణ మంత్రి పొన్నం

Ponnam Prabhakar Slams BJP Over AI Summit Incident
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలోని 'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో నిన్న జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. భారత మండపంలో జరుగుతోన్న సదస్సు వేదిక వద్దకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుని చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. హాల్ నెంబర్ 5లోకి ప్రవేశించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మంత్రి స్పందించారు.

ఏఐ ఇంపాక్ట్ సదస్సు బీజేపీ పార్టీది కాదని, అది భారత ప్రభుత్వం నిర్వహిస్తోందని పొన్నం ప్రభాకర్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ కార్యక్రమమని గుర్తు చేశారు. భారత్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే కాదని, ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించాలన్న విషయం గుర్తించాలని అన్నారు. తెలంగాణ విజన్ 2047 భారత సమ్మిట్ కార్యక్రమం నిర్వహించినప్పుడు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్‌లను ఆహ్వానించామని అన్నారు.

దేశ అభివృద్ధికి ఆయా రాష్ట్రాల ఐక్యత అవసరమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష పూర్తికంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఏఐ సదస్సును అడ్డుకోవాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏ కోశాన లేదని, కానీ నిన్న కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రపంచ దేశాల ముందు దేశ నాయకులమంతా ఒక్కటేనని చాటాల్సి ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి ప్రతిపక్ష నాయకులను అవవమానిస్తోందని విమర్శించారు.

గణతంత్ర దినోత్సవం రోజున రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటును కేటాయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రితో సమానంగా ప్రతిపక్ష నాయకులను గౌరవించామని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రతి విషయంలో సంకుచితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయాలు ఉంటే పార్లమెంటు వేదికగా, ఎన్నికల్లో చూసుకోవాలని, కానీ అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా దూరం పెట్టడం సరికాదని అన్నారు. ఇదెక్కడి రాజనీతి అని ప్రశ్నించారు.

భారత పురాణ గాథల్లో విశాల దృక్పథం ఉంటుందని, మన ప్రభుత్వం కూడా ఆ విశాల దక్పథాన్ని చాటుకోవాలని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవమానించి ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖం మీదనే పడుతుందని గుర్తించాలని అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపలేరని... రాహుల్ గాంధీని మీరు ఎంత అడ్డుకుంటే ఆయన వైభవం, కీర్తి అంత ఎత్తుకు ఎదుగుతాయని అన్నారు.

రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీలది అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో గాంధీ కుటుంబం అంటే ఇండియాకు పర్యాయపదంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విధానాలు మారి ప్రపంచ దేశాల ముందు భారత్ ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Ponnam Prabhakar
AI Impact Summit
Telangana
Congress
BJP
Narendra Modi
Rahul Gandhi

More Telugu News