Kilauea Volcano: 13 వందల అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా.. వీడియో ఇదిగో!

Kilauea Volcano Erupts Lava Fountains Reach 1300 Feet
  • హవాయిలోని కిలోవా అగ్నిపర్వత ఉగ్రరూపం
  • పది గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన విస్ఫోటనం
  • ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక వాల్కనోగా కిలోవా
  • 2024 డిసెంబర్ నుంచి తరచుగా ఎగసిపడుతున్న లావా
ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘కిలోవా’ మరోసారి విస్ఫోటనం చెందింది. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ విస్ఫోటనం పది గంటల పాటు కొనసాగింది. హవాయి ద్వీపకల్పంలోని ఈ అగ్నిపర్వతం 2024 డిసెంబర్ నుంచి వరుస విరామాలతో లావా విరజిమ్ముతోంది. దాదాపు 2,80,000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అగ్నిపర్వతం, 1952 నుండి ఇప్పటివరకు డజన్ల కొద్దీ సార్లు బద్దలై తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.

లావా ఫౌంటైన్..
యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) నివేదిక ప్రకారం, ఈ విస్ఫోటనం దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. అగ్నిపర్వత ముఖద్వారం నుండి ఎర్రగా మండుతున్న లావా ఫౌంటైన్లు ఏకంగా 1,300 అడుగుల (సుమారు 400 మీటర్లు) ఎత్తు వరకు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. ఈ అద్భుత దృశ్యాలు సమీపంలోని కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

35 వేల అడుగుల ఎత్తున బూడిద మేఘం
ఈ విస్ఫోటనం ధాటికి వెలువడిన పొగ, గ్యాస్ మరియు బూడిద మేఘాలు సముద్ర మట్టానికి సుమారు 35 వేల అడుగుల ఎత్తు వరకు వ్యాపించిందని జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీనివల్ల పహాలా, నాలెహు వంటి సమీప గ్రామాలపై స్వల్పంగా బూడిద వర్షం కురిసింది.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
కిలోవా అగ్నిపర్వతం ఒక క్రమ పద్ధతిలో స్పందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రతి విస్ఫోటనం 12 గంటల లోపే ముగుస్తోంది. ఒక విస్ఫోటనం తర్వాత మరోసారి లావా చిమ్మడానికి కొన్ని రోజుల నుండి రెండు వారాల వరకు సమయం తీసుకుంటోంది. ఆదివారం రాత్రి 11:38 గంటలకు ఈ 42వ ఎపిసోడ్ ముగియడంతో, ప్రస్తుతం అగ్నిపర్వతం శాంతించింది. తదుపరి విస్ఫోటనం మార్చి మొదటి వారంలో ఉండవచ్చని అంచనా.
Kilauea Volcano
Hawaii volcano eruption
Kilauea eruption 2024
volcanic activity
lava fountains
US Geological Survey
pahala
Nalehu

More Telugu News