Renuka Chowdhury: ఎంపీలపై వ్యాఖ్యలు.. రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు

Renuka Chowdhury Faces Privilege Notice Over MP Comments
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. గత శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలోకి తన కారులో వీధికుక్కను తీసుకురావడం, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 23వ తేదీలోగా ఈ ఆరోపణలపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని కమిటీ ఆమెను ఆదేశించింది.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో రేణుకా చౌదరి.. తాను కాపాడిన ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటుకు తీసుకొచ్చారు. దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా "లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు" అని ఆమె వ్యాఖ్యానించినట్లు బీజేపీ ఎంపీలు బ్రిజ్‌లాల్, ఇందుబాల గోస్వామి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీలను అవమానించేలా, వారి పరువుకు నష్టం కలిగించేలా రేణుక మాట్లాడారని వారు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

ఈ ఫిర్యాదును రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. గత వారం సమావేశమైన కమిటీ ఈ అంశంపై చర్చించి, రేణుకా చౌదరి నుంచి వివరణ కోరాలని నిర్ణయించింది. ఈ నోటీసుపై రేణుకా చౌదరి కార్యాలయం స్పందించింది. పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా దీనిపై సమాధానం ఇస్తామని తెలిపింది.
Go Back to Shorts
Renuka Chowdhury
Rajya Sabha
Privilege Committee
Parliament
Street Dog
BJP MPs
Brijlal
Indubala Goswami
Winter Session
Defamation

More Telugu News