Tarique Rahman: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిక్ రహ్మాన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Modi Congratulates Tarique Rahman on BNP Election Victory in Bangladesh
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

గురువారం బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. వెలువడుతున్న అనధికారిక ఫలితాల ప్రకారం 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలే దేశానికి తిరిగి వచ్చిన తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ పార్టీ 300 స్థానాల పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో ఒక పోస్ట్ పెట్టారు. "బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీని ఘన విజయపథంలో నడిపించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.

అమెరికా కూడా తారిక్ రహ్మాన్‌ను అభినందించింది. అయితే, బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అనధికారిక లెక్కల ప్రకారం బీఎన్‌పీ కూటమి 200కు పైగా స్థానాల్లో గెలుపొందినట్లు తెలుస్తోంది. దీంతో తారిక్ రహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది.
Go Back to Shorts
Tarique Rahman
Bangladesh election
BNP victory
Narendra Modi
Sheikh Hasina
Bangladesh Nationalist Party
Bangladesh Parliament
India Bangladesh relations
Bangladesh politics
Prime Minister Modi

More Telugu News